పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28. పొట్టి జాన్ అనే ముని ఈలా వాకొన్నాడు. "ఓ రాజు శత్రురాజు పట్టణాన్ని వశం చేసికోవాలంటే దానిలోని ప్రజలకు ఆహారమూ నీళ్ళూ అందకుండా వుండేలా చేస్తాడు కదా! ఆకలి దప్పులకు తట్టుకోలేక విరోధులు అతనికి లొంగిపోతారు. అలాగే సాధకుడు ఉపవాసాలు చేస్తూ ఆకలిదప్పులు అనుభవిస్తూంటే అతని ఆత్మశత్రువులైన పిశాచాలు కూడ లొంగిపోతాయి."

29. ఈ మునే మరోసారి ఈలా వచించాడు. “మనం ఆత్మవిమర్శ అనే తేలిక బరువును మన నెత్తిమిూది నుండి దించివేసాం. ఆత్మస్తుతి అనే పెద్ద బరువును మన నెత్తికి ఎత్తుకొన్నాం."

30. ఇతడే ఇంకోసారి యిలా చెప్పాడు. "పునీతులు తోటలోని రకరకాల పండ్ల చెట్ల లాంటివాళ్ళు. అవి వేరు వేరు రుచులు గల ఫలాలు కాస్తాయి. ఐనా వాటి కన్నిటికీ ఒకే నూతి నుండి నీరు పెడతారు. ఒక అర్చ్యశిష్ణుని పుణ్యాభ్యాసం ఒక తీరుగా వుంటుంది. మరో అతని పుణ్యాభ్యాసం మరో తీరుగా వుంటుంది. కాని వారి నందరినీ పునీతం చేసేది మాత్రం ఒక్క పవిత్రాత్మే."

31. ఈ ముని ఆశ్రమంలో తర్ఫీదు పొందిన తీరు ఇది. అతడు సేవించిన ముని ఓ యెండిపోయిన కర్రను నేలలో పాతి రోజూ దానికి నీరు పోయమని జాన్ ని ఆజ్ఞాపించాడు. ఆ చుట్టుపట్ల నీరు దొరకదు. చాల దూరం వెళ్లి తెచ్చుకోవాలి. ఐనా జాన్మని ఓపికతో రోజూ నీళ్లు తెచ్చి దానికి పోసేవాడు. అలా మూడేండ్లు పోయగా అది కడన చిగిర్చి పూలు పూచింది. శిష్యుని విధేయతకు తగిన ఫలం లభించింది.

32. ఓ దినం ఈసిడోర్ ముని అలెగ్జాండ్రియా పట్టణానికి అగ్రపీఠాధిపతియైన తెయోఫీలస్ని సందర్శించడానికి వెళ్ళాడు. అతడు తిరిగి రాగానే ఆశ్రమంలోని సన్యాసులు అయ్యా ఆ పట్టణంలోని వింతలేమిటి అని అడిగారు. ముని నేనా నగరంలో అగ్రపీఠాధిపతిని తప్ప మరెవ్వరిని చూడలేదని చెప్పాడు. ఆ మాటలకు సన్యాసులు విస్తుపోయి అయ్యా! ఆ నగరం ఏదైనా ప్రమాదం వల్ల తగలబడి పోయిందా యేమిటి అని అడిగారు. ముని ఆ పట్టణం బాగానే వుంది. నాకు తియోఫీలస్ను దప్పితే మరెవ్వరినీ చూడబుద్ధి పట్టలేదు. కనుక తలవంచుకొని వెళ్లి తలవంచుకొని తిరిగివచ్చాను అన్నాడు. ఆ మాటలకు సన్యాసులు భక్తి తెచ్చుకొని తమ కండ్లను ఇంకా అదుపులో పెట్టుకొన్నారు.

33. సెలూషియా ఈసిడోర్ అనే యతి ఈలా పలికాడు. భక్తితో జీవించకుండా మాట్లాడేవాడికంటె మాట్లాడకుండా భక్తితో జీవించేవాడు మెరుగు. మొదటివాడు మాటలాడినా ప్రయోజనం లేదు. రెండవవాడు మాటలు కట్టిపెట్టి మౌనంగా వున్నా మంచి పనులు చేస్తాడు. మన మాటలకు చేతలకూ పొందిక కుదిరితే పరమార్ధా న్నంతటినీ సాధించినట్లే.