పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. అగతోన్ ముని తనకు ఎవరిని గూర్చయినా, ఏ వస్తువును గూర్చయినా, విమర్శించాలనే కోరిక పుట్టినపుడు తనతోతాను ఈలా చెప్పుకొనేవాడు. “అగతోన్! పరవిమర్శ దేవుని పని కాని నీ పనికాదు." ఈలా అనుకొని అతడు తన ప్రార్థనలో తాను నిమగ్నుడయ్యేవాడు.

14. ఇంకా అగతోన్ ముని ఇలా నుడివేవాడు. "కోపి మృతులను బ్రతికించగలిగేంతటి వాడయినాసరే, దేవునికి అంగీకార యోగ్యడు కాలేడు".

15. ఇంకా అతడు ఈలా చెప్పేవాడు. "నా కెవరైనా కుష్ఠరోగి ఎదురువస్తే నా దేహాన్ని అతనికిచ్చి అతని దేహాన్ని నేను తీసుకోవాలనిపిస్తుంది. ఇది ఉదాత్తమైన ప్రేమ".

16. ఓ రోజు అగతోన్ ముని ఏవో చిన్న వస్తువులను అమ్మకోడానికి నగరానికి వెళ్తూండగా దారిలో కాళ్లులేని అవిటివాడు కన్పించాడు. అతడు తన్ను గూడ నగరానికి మోసికొని వెళ్ళమనగా అగతోన్ అలాగే చేసాడు. అగతోన్ పట్టణంలో ఓ వస్తువును అమ్మగానే అవిటివాడు నీకెంత సొమ్మ ముట్టిందని అడిగేవాడు. అగతోన్ ఇంత అని చెప్పేవాడు. అవిటివాడు ఆ సొమ్ముతో తనకేదో వస్తువు కొనితెమ్మని అడిగేవాడు. ముని అలాగే చేసేవాడు. ఆవిధంగా తన వస్తువుల విూద వచ్చిన సొమ్మంతా అవిటివాని విూద ఖర్చుపెట్టాడు. అతడు తిరిగి ఆశ్రమానికి రాబోతుండగా అవిటివాడు తన్ను మళ్లా మోసికొనిపోయి తన పూర్వ స్థానంలో వదలివేయమని అడిగాడు. ముని అలాగే చేసాడు. అవిటివాడు అతన్ని నాయనా! నీకు భూమిమిూదా స్వర్గంలోను దేవుని దీవెనలు లభిస్తాయి అని దీవించాడు. అగతోన్ కండ్లు విప్పి చూడగా అతనికి అవిటివాడు కన్పించలేదు. అతడు ఆ మునిని పరీక్షించడానికి వచ్చిన దేవదూత!

17. ఒక వృద్ధసాధువు 50 ఏండ్లదాకా రొట్టెను తినలేదు, ద్రాక్షరసం ముట్టలేదు. అతడు నేను కామాన్ని దురాశనీ, ఆత్మాభిమానాన్నీ పూర్తిగా జయించానని గొప్పలు చెప్పకొనేవాడు. అప్పుడు అబ్రాహామనే ముని అతని దగ్గరికి వచ్చి నాయనా! నీవు నీ గదిలోనికి పోయినపుడు నీ చాపపై ఓ స్త్రీ పరుండి వుండడం చూస్తే నీకు ఆమెపై కోరిక పట్టదా అని అడిగాడు. సాధువు, పడుతుంది. కాని నేను నా కామ వికారాన్ని అణచుకొని ఆమెను ముట్టను అన్నాడు. అబ్రాహాము మళ్ళా నీవు దారివెంట బోయేపుడు రాళ్ళతో పాటు బంగారు ముక్క కూడ కన్పిస్తే నీకు దానివిూద కోరిక పుట్టదా అని అడిగాడు సాధువు, పుడుతుంది. కాని నేను నా దురాశను అణచుకొని దాన్ని ముట్టుకోను అన్నాడు. అబ్రాహాము ఇచ్చట ఇద్దరు సన్యాసులు వున్నారనుకో. వారిలో ఒకనికి నీవంటే యిష్టం, రెండవవానికి అనిష్టం. ఈ రెండవవాడు నిన్ను గూర్చి పరుషోక్తులు కూడ పలికాడు. వాళ్ళిద్దరూ నీ దగ్గరికి వచ్చారనుకో. నీవు వాళ్ళిద్దరిని సమానంగా ఆదరిస్తావా అని