పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేవండి. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను అన్నాడు. కాని అర్సేనియస్ నీవిక్కడినుండి వెళ్ళిపోయిందాకా నేను పైకి లేవను అన్నాడు. ఎంత బతిమాలినా అతడు పైకి లేవకపోవడం చూచి సన్యాసి వెళ్లిపోయాడు.

9. అర్సేనియస్ చనిపోతూండగా శిష్యులు అయ్యా! విూరు కన్నుమూసాక విూ దేహాన్ని ఏమి చేయమంటారని అడిగారు. ముని నా కాళ్ళకు త్రాడుగట్టి నా శవాన్ని కొండ విూదికి లాక్కొని వెళ్ళి అక్కడ వదలివేయండి అని చెప్పాడు. అతడు పలుసార్లు తన్ను తాను ఈలా హెచ్చరించుకొనేవాడు. “అర్సేనియస్! నీవు లోకాన్ని వీడి ఈ యెడారికి ఎందుకొచ్చావు?" "నేను మాట్లాడినందుకు చింతించాను గాని మౌనంగా వున్నందుకు ఏనాడూ చింతించలేదు". అతడు మరణిస్తూండడం చూచి శిష్యులు దుఃఖిస్తూ అయ్యా! నీకు మరణభయం లేదా అని అడిగారు. అతడు “ఇప్పడే కాదు, నేను సన్యాసి నైనప్పటి నుండి మృత్యుభీతితోనే జీవిస్తూ వచ్చాను" అని పలికాడు. ఈ మాటలు పలికి చనిపోయాడు.

10. ఓ దినం అగతోన్ ముని ఆశ్రమంలో చేరడానికి ఓ ఆగంతకుడు వచ్చాడు. అతడు బాబూ! విూ ఆశ్రమంలోని సాధువులతో ఏలా మెలగాలో తెలియజేయండి అని అడిగాడు. అగతోన్ నీవు తొలిరోజు ఇక్కడ పరాయివాడిలాగ గడుపుతావు కదా! నీ జీవిత కాలమంతా నేను పరాయి వాణ్ణనే భావంతోనే ఇక్కడ జీవించు. ఇక్కడ ఎవరితోను చనువులకు దిగవద్దు అని చెప్పాడు.మకేరియస్ అనే మరోముని ఈ మాటలు విని, ఇతరులతో చనువుగా వుంటే ఏమి నష్టం అని అడిగాడు. అగతోన్ చనువు గాలి దుమారం లాంటిది. అది చెట్టుమిూదికి వీచి దాని కాయల నన్నిటినీ రాలగొడుతుంది అని నుడివాడు. మకేరియస్ ఇతరులతో చనువుగా మాట్లాడితే అంత ప్రమాదం కలుగుతుందా అని విస్తుపోయాడు. అగతోన్ ముని “నాయనా! విచ్చలవిడిగా వాగే నాలుకంత ఘోరమైంది మరొకటి లేదు.అది చిన్న పాపాలకు మూలం. కనుక ఏకాంతంగా వసించే సాధువుకి గూడ నోటికి వచ్చినట్లుగా వాగడం తగదు" అని చెప్పాడు.

11. ఇంకా అగతోన్ ముని యిూలా వాకొన్నాడు. "నాకు తెలిసినంతవరకు నేనెవరి విూద కోపతాపాలు పెట్టుకొని రేయి నిద్రకు ఉపక్రమించలేదు. నామిూద కోపతాపాలతో ఎవరినీ నిద్దుర పోనీయలేదు".

12. ఓ సాధువు అగతోన్ ఆశ్రమంలో జీవించడానికి వచ్చాడు. అతడు వస్తూ వస్తూ దారిలో పెట్లుప్పుముక్క కన్పింపగా దాన్ని ఏరుకొని వచ్చాడు. అగతోన్ ఆ ముక్క యొక్కడిదని అడగ్గా సాధువు అది దారిలో దొరికిందని చెప్పాడు. అగతోన్ "నాయనా! నీవు స్వయంగా దారిలో పెట్టని ముక్కను ఏలా తీసికొనివచ్చావు? పోయి దాని స్థానంలో దాన్ని వుంచిరా" అని ఆజ్ఞాపించాడు.