పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాధ్యతా నిర్వహణకు సిద్ధం చేయాలి. వాళ్ళకు నాయకత్వపు తర్ఫీదు నిప్పించాలి. ఈ పనిని మన బిషప్పలూ గురువులూ చేయాలి. చక్కని నాయక లక్షణాలను అలవర్చుకోకపోతే గృహస్థలు క్రైస్తవ సమాజాలకు మేలుకి మారుగా కీడు చేస్తారు. ఇందుకు ఓ వుదాహరణాన్ని చూపించవచ్చు. మన దేశంలో ప్రోటస్టెంటు సమాజాలు వాళ్ళ గృహస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. కాని ఈ గృహస్థలు సేవాపరులైన నాయకులుగా గాక స్వార్థపరులైన నాయకులుగా తయారయ్యారు. ఎవరికి దొరికింది వాళ్లు కొట్టేసి క్రైస్తవ సమాజాలను నాశం చేసారు. అంతఃకలహాలు తెచ్చిపెట్టి క్రైస్తవులను విభజించారు. నేడు ప్రోటస్టెంటు సమాజాలు పెరగడం లేదు గదా, ఉన్నవి కూడా నిలువకుండ పోతున్నాయి. క్యాతలిక్ సమాజంలో మనం ఈలాంటి పొరపాటుని చేయకూడదు. మన గృహస్మలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం నేర్చుకొన్న పిదపనే గాని వాళ్ళకి నాయకత్వంలో పాలుపంచి పెట్టకూడదు.


మామూలుగా మన గృహస్థల్లో కన్పించే అవలక్షణాలు ఇవి. క్రియాసామర్థ్యం వుండదు. దీక్షతో పని చేయరు. కార్యాన్ని సంతృప్తికరంగా ముగించరు. నిజాయితీ, నమ్మదగినతనమూ వుండవు. స్వార్థబుద్ధిని ప్రదర్శిస్తారు. మోసానికి పాల్పడి డబ్బు కొట్టేస్తారు. పదవులకూ పేరు ప్రతిష్ఠలకూ ప్రాకులాడతారు. అంతఃకలహాలు తెచ్చిపెడతారు. బడుగు వర్గాలవాళ్ళను అన్యాయంగా అణగదొక్కుతారు. ఐనా మంచి తర్ఫీదుద్వారా ఈ యవలక్షణాలను కొంతవరకు సవరించవచ్చు. గృహస్థల తర్ఫీదునకు నాందిగా "ప్యారిష్ కౌన్సిల్స్" ను ఏర్పాటు చేయాలి.


4. మన గురువులూ బిషప్పలూ గృహస్థలకు తర్ఫీదు నిప్పించి వాళ్ళను మంచి నాయకులుగా తయారు చేయాలని చెప్పాం. వాళ్ళకు కూడ నాయకత్వములోను కార్యభారంలోను పాలు ఈయడానికి మన అధికారులు సిద్ధం కావాలని చెప్పాం. గృహస్థలు స్వార్థబుద్ధితో గాక బాధ్యతాయుతంగా నాయకత్వాన్ని నిర్వహించాలని చెప్పాం. ఈ పట్టున గృహస్తులు అధికారాన్ని ఏలాగైనా చేజిక్కించుకోవాలని కోరుకొనేవాళ్ళలాగ ప్రవర్తించ కూడదు. గురువులు దయాదాక్షిణ్యాల కొద్దీ అధికారాన్ని పంచిపెట్టేవాళ్ళలాగ ప్రవర్తించకూడదు. గృహస్థలను సేవాబాధ్యతలో పాలుపంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాము అన్నట్లుగా గురువులు తలంచాలి. సేవాబాధ్యతను స్వీకరిస్తున్నాము అన్నట్లుగా గృహస్థలు తలంచాలి.


5. ఒక్క ఉదాహరణ తీసికొందాం, గురువులు కాని కన్యలు కాని నిర్వహించే విద్యాసంస్థలో గృహస్తులు కూడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారను కొందాం. అప్పుడు గురువులూ కన్యలూ, ఈ గృహస్థ ఉపాధ్యాయులతో ఏలా ప్రవర్తించాలి?