పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. కాని చేతలు కార్యాచరణకు పురికొల్పుతాయి" అంటుంది ఓ లాటిను సామెత. అంచేత మన మాటలకంటే చేతలు మేలు. ఇక సోదర ప్రేమను పాటించాలన్నాగూడ, మొట్టమొదట మన ఉదాత్త జీవితం ద్వారానే ఆ పనికి పూనుకోవాలి. ప్రభువు పర్వత ప్రసంగంలో "మీ వెలుగును ఇతరుల యెదుట ప్రకాశింపనీయండి. అప్పడు నరులు మీ సత్ర్కియలను చూచి పరలోకంలో వున్న మీ తండ్రిని కొనియాడుతారు" అన్నాడు– మత్త 4, 16.

కూడు, గుడ్డ, ఇల్లు, నరుని ప్రాథమికావసరాలు. ఈ మూడూ లేక అలమటిస్తూ అధమ జీవితం జీవించేవాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది కన్పిస్తూంటాడు. ఈలాంటి వాళ్ళకు చేతనైనంత వరుకు సాయపడ్డం ఉత్తమ సోదరప్రేమ, విశేషంగా ఇండియాలో ప్రస్తుత పరిస్థితుల్లో పేదప్రజలు ఈలాంటి సహాయాన్ని ఎంతైనా మెచ్చుకుంటారు. ఈ ప్రాథమికావసరాలతోపాటు విద్యా వైద్యసేవలను కూడ చేరుస్తుండాలి. కాని ఈ రెండిటినీ సమర్ధంగా నిర్వహించాలంటే వ్యక్తులు చాలరు. సమాజాలవసరం.

ఇతరులకు భగవంతుణ్ణి గూర్చి తెలియజెప్పడంగూడ గొప్ప సోదరప్రేమ. బహుప్రాచీన కాలంలోనే ఉపనిషత్తులు విద్యలన్నిటికంటె బ్రహ్మవిద్య గొప్ప విద్య అన్నాయి. వైదిక కాలమునాటి యాజ్ఞవల్క్యునిభార్య గార్టీకి "బ్రహ్మవాదిని" అని బిరుదు. ఈనాడు మనం ఈ బోధనా సేవలో వెనుకంజ వేయకూడదు. బైబులు భగవంతుడు ఓ తండ్రిలాంటివాడు. అతని కుమారుడు క్రీస్తు, ఈ క్రీస్తు మనలను రక్షించి మనకు పెద్దన్న అయ్యాడు. అతని సహాయం వలన మనం రక్షణం పొందుతాం! ఈ యంశాలను క్రైస్తవులకూ, క్రైస్తవేతరులకూ వివరించవచ్చు. ఉత్తమ క్రైస్తవ సాహిత్యాన్ని చదవవచ్చు, ఇతరులకు అందజేయవచ్చు. క్రైస్తవమతం విశేషంగా ప్రేషితమతం.

ప్రార్థనా సేవ గూడ చాల గొప్పది. అన్నదాన భూదాన శ్రమదాన ధనదానాదులకంటే ప్రార్ధనాదానం శ్రేష్టమైంది. ప్రార్థన ద్వారా నరుజ్జీ దేవునితో జోడిస్తాం. ఇంతకన్న శ్రేష్టమైన సోదరప్రేమ ఏముంటుంది? ప్రార్థనా సేవకు బాధాసేవను కూడ చేర్చాలి. అనగా మన బాధలను ఓర్పుతో సహించి తోడిప్రజల శ్రేయస్సుకొరకు సమర్పించడం.

పైన నుడివిన రీతిగా సోదరప్రేమను రకరకాల సేవల ద్వారా రకరకాల విధానాలలో చూపవచ్చు. తామున్న పరిస్థితులను బట్ట ఎవరు ఏలాంటి సోదర ప్రేమను చూపించగలరో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. జనుల అభిరుచులూ, అవకాశాలూ చుట్టపట్ల వున్న జనుల అవసరాలూ భిన్నభిన్నంగా వుంటాయి. వీటిని పురస్కరించుకొని ప్రతి క్రైస్తవ భక్తుడూ తనకు చేతనయిన ప్రేమ మార్గాన్ని ఎన్నుకోవాలి. గొప్ప విషయాల్లోనో, స్వల్ప విషయాల్లోనో సోదరప్రేమను సాధించాలి.