పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషపూరితం. దాని తోనే దేవుని స్తుతిస్తాం. దానితోనే దేవునికి పోలికగా వుండే నరుడ్డి శపిస్తాం. ఒకే జలధారనుండి ఉప్పనీళ్ళూ తీయని నీళ్ళూ వెలువడతాయా? ఐనా ఈ నాలుకనుండే ఆశీర్వచనాలూ, శాపవచనాలూ వెలువడతాయి. ఇది చాలా చోద్యం - ఇవి యాకోబు భావాలు. ఈలాంటి నాలుకను బుద్ధిమంతులు ప్రయత్నంచేసికూడ స్వాధీనం చేసికోలేక పోతున్నారనగా, ఇక ఏ ప్రయత్నమూ చేయని మూర్శలకు అది లోబడుతుందా?

నాలుకను స్వాధీనం చేసికోవాలి అన్నాం. పై యాకోబు జాబే "ఎవడైనా నోటిని అదుపులో పెట్టుకోకుండా నేను భగవద్భక్తికలవాణ్ణి అనుకొంటే వాని భక్తి వ్యర్ధమే ఔతుంది. అతడు తన్నుతానె మోసగించుకుంటున్నాడు" అని చెప్పంది – 1,26. కాని ఈ నాలుకను స్వాధీనం చేసికోవడం ఎలా? మొదటిది, నాలుక గుణం చక్కగా తెలిసికొని వుండాలి. దాన్ని అదుపులోనికి తీసుకురావాలనే కోరికా వుండాలి. ఆమీదట, ఎటూ మనంతట మనం దాన్ని జయించలేంగనుక, వినయంతో దైవసహాయం అడుగుకోవాలి. అందుకే కీర్తనకారుడు కూడ "ప్రభూ! నానోటికి తలుపులు బిగించి, నా పెదవులకు తాళము వేయి" అని మనవిచేసాడు - 14,3. సీరా జ్ఞాన గ్రంథకర్త "నా నోటికి తలుపులుబిగించి నాపెదవులకు తాళం వేయగలవా డెవడు? ఈ నాలుక వలన నేను నాశమై పోకుండేలాగ ఈ నాలుక వలన నేను కూలిపోకుండేలాగ నన్ను కాపాడగలవా డెవడు" అని మొర్ర పెట్టుకున్నాడు - 22,33. ఈ భక్తుల్లాగే మనంకూడా భగవత్సహాయం అడుగుకోవాలి. మన శక్తి కొరతవడిన కాడ భగవచ్చక్తి పని చేస్తుంది.

ఇంకా, దివ్య సత్ర్పసాదం పుచ్చుకొన్నపుడు ప్రభువు మన జిహ్వాగ్రంమీద విశ్రమిస్తాడు. ఆ దుష్టజిహ్వను అదుపులో పెట్టుకొనే భాగ్యం ప్రసాదించమని కూడ ఆ సమయంలో ప్రభువనే మనవి చేసుకోవాలి. దేవుడేగాని నరుడు నాలుకను సాధువుగా జేయలేడు.

4.చేతల్లో సోదర ప్రేమ

మన తలపుల్లో మాటల్లో సోదర ప్రేమను ఏలా పాటించాలో పూర్వాధ్యాయాల్లో విచారించి చూచాం. ఈ యధ్యాయంలో చేతల్లో సోదర ప్రేమను ఏలా పాటించాలో విచారించి చూద్దాం.

1. ఇతరులకు మేలు చేయడం

ప్రేమను మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. సోదరప్రేమ కూడ ఆలాగే, ఈలా సోదరప్రేమను క్రియాత్మకంగా చూపించడం ద్వారా ఇతరులకు మేలుచేస్తాం. ఇక, సోదర ప్రేమ క్రియాత్మకంగా చూపించే మార్గాలు చాలా వున్నాయి. మొట్టమొదట మన జీవితమే ఉత్తమంగా, నిర్మలంగా వుండాలి. లోకమంతటా మహానుభావులు తమ బోధలకంటే గూడ జీవితం ద్వారానే అధికంగా బోధించారు.