పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పాపం

బైబులు భాష్యం - 5

మనవి మాట

ప్రస్తుత సంచికలో 1-83 నంబర్లు పాపాన్ని గూర్చి పూర్వవేదం సూచించే భావాలను పేర్కొంటాయి. వీనిలో 1-11 నంబర్లు ఆదికాండలోని భావాలను, 12-32 నంబర్లు ప్రవక్తల ప్రవచన గ్రంథాల్లోని భావాలను వివరిస్తాయి. ఇక 34-61 నంబర్లు పాపాన్ని గూర్చి నూత్నవేదం సూచించే భావాలను పేర్కొంటాయి. వీనిలో 34-42 నంబర్లు మూడు సువార్తల్లోని భావాలను, 43-49 నంబర్లు యోహాను రచనల్లోని భావాలను, 50-61 నంబర్లు పౌలు లేఖల్లోని భావాలను వర్ణిస్తాయి. ఇదీ విషయ విభాగం.

1. మీరు ఆ చెట్ట పండు మాత్రం తినకూడదు.

ఆది 3,3 ఆది దంపతులు ఏం పాపం చేసారో మనకు తెలీదు. బహుశ ఆదికాండం వ్రాసిన రచయితకుగూడ తెలీదు. కాని వాళ్ళమాత్రం దేవుని ఆజ్ఞ మీరారు. దేవునిపట్ల అవిధేయత చూపారు. ఆదామేవలు చూపిన ఈ యవిధేయతను ఆదికాండం వ్రాసిన రచయిత ఓ కథలాగ వర్ణించుకుంటూ పోయాడు. కథలా చెప్లేనేగాని ఆ ప్రాచీన కాలపు హీబ్రూ ప్రజలకు విషయం బోధపడదు.

అన్ని చెట్ల పండల్లా తినవచ్చుగాని, తోట నడుమనున్న చెట్ట పండు మాత్రం తినకూడదని ప్రభువు ఆది జననీజనకులకు ఆజ్ఞయిచ్చాడు. కాని ఆ చెట్ట పండు ఏవకు యింపుగా కనిపించింది. దాన్ని తింటే తెలివితేటలు కల్లుతాయికాబోలు అనిపించింది. కావున ఆమె స్వయంగా పండు కోసుకొని తింది. భర్త చేత తినిపించింది - ఆది 3,6. ఇది ఆదామేవల అవిధేయత, ఇదే తొలిపాపం, ఇక్కడ, ఆదామేవలు తినకూడని పండు తిన్నారని మనం నమ్మనక్కరలేదు. కాని దేవుని కట్టడమీరి యేదో పాపం చేసారని మాత్రం నమ్మాలి.

నరుడు పాపం చేసినప్పుడెల్ల దేవుని పట్ల అవిధేయత చూపుతుంటాడు. మన పాపాలూ అవిధేయతను చూపుతాయి గనుక, వాటిని తలంచుకొని పశ్చాత్తాపపడదాం.

2. దేవునిలాగే మీరూ మంచి చెడ్డలు తెలిసికుంటారు - ఆది 3.5

తినవద్దనిన పండు కోసికొని తినినంత మాత్రాన్నే ఆదామేవలు అంత పెద్ద పాపం చేసారా అని మనం ఆశ్చర్యపోతాం. కాని యిక్కడ పండు తినడంగాదు, ఏ వద్దేశంతో ఆ పండు తిన్నారు అన్నది ప్రధానం. ఆ పండు తిన్నట్లయితే దేవునిలాగే మీరూ మంచి చెడ్డలు తెలిసికుంటారని పాము చెప్పింది. కనుక మంచి చెడ్డలు తెలిసికోవాలన్న కోర్మెతోనే ఆదామేవలు పండు తిన్నారు.