పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వేషించడమనగా నరహత్యకు పూనుకోవడమే - 3,15 సోదరప్రేమను పాటించడమనగా దేవుని ఎరుగడం. దానిని పాటింపమి యనగా దేవుని ఎరుగక పోవడం - 4, 7-8. సోదరప్రేమతో జీవించేవానిలో దేవుడు నెలకొని వుంటాడు. కనుక దైవనివాసమే సోదరప్రేమకు బహుమానం - 4,12. దేవుడే మొదట నరులను ప్రేమించి వాళ్ళకొరకుతన క్రీస్తును పంపాడు. దేవుని ఈ ప్రేమను ఆదర్శంగా బెట్టుకొని, అతని బిడ్డల్లా మెలుగుతూ, మనం కూడ తోడి ప్రజలను ప్రేమిస్తూండాలి - 4, 9–11.

కనుక సోదరప్రేమ సోదరద్వేషాలు చీకటివెలుగుల లాంటివి. చావుబ్రతుకుల లాంటివి, సత్యాసత్యాల లాంటివి, దైవసంతాన పిశాచసంతానాల లాంటివి. ఈలాంటప్పుడు మనం సోదరప్రేమను శ్రద్ధతో పాటించడం ఎంత అవసరమో వేరుగా చెప్పాలా?

4. సోదర ప్రేమను అలవరచుకోవడం ఎలా?

సోదరప్రేమను అలవరచుకోవడం అంత సులభం కాదు. భగవంతుడు పరిపూర్ణుడు. గాని నరుడు దౌర్బల్యుడు. నరుని దుర్గుణాలు మనకు ఏవగింపును కలిగిస్తాయి. అతనితోడి నిరంతర పరిచయంవల్ల అతన్నిచిన్నచూపు చూస్తుంటాం. "అతి పరిచయాత్ అవజ్ఞా" అన్నారు పెద్దలు. పైగా “నరునికి నరుడు తోడేలు" అనే స్వభావం మనందరిలోను కొద్దోగొప్పో వుండనేవుంటుంది. ఈలాంటి పరిస్థితుల్లో ప్రయత్నపూర్వకంగా కృషి చేస్తేనేగాని తోడి మానవుణ్ణి అంగీకరించి ప్రేమించలేం.

సోదర ప్రేమ పాటించాలంటే మొదట మనకు ప్రేమతోకూడిన కోరికలుండాలి. మన హృదయం తోడి ప్రజలకు సుముఖంగా వుండాలి. అనగా మనం మున్ముందుగా హృదయాన్ని తోడి ప్రజలను గూర్చిన మంచి కోరికలతో నింపుకోవాలి. మనకు తెలిసినా తెలియకపోయినా, మన మందరమూ ఏలాంటి తలపులు తలుస్తుంటామో ఆలాంటి చేతలకు పూనుకుంటూంటాం.

మనం తోడి ప్రజలలో వున్నదివ్య లక్షణాలను జూచి ఆ ప్రజలను ఆదరించి ప్రేమించడం నేర్చుకోవాలి. సోదరప్రేమ కూడ దైవ ప్రేమ లాంటిదే. అనగా తోడి ప్రజల్లో వున్న దివ్యలక్షణాలను జూచి దేవుణ్ణి ప్రేమించినట్లే ఆ ప్రజలనూ ప్రేమిస్తున్నామనుట. ఇక, ఈ దివ్యలక్షణాలు ఏమిటివి?

1. వర ప్రసాదం ద్వారా యీ వ్యక్తి దేవునిలాంటివాడు ఔతాడు - 2 పేత్రు 1,4.

2. పరిశుద్దాత్మ ఈ వ్యక్తి హృదయంలో ఓ దేవాలయంలోలాగ నెలకొని వుంటుంది - 1 కొ 3, 16.

3. జ్ఞానస్నానంద్వారా ఈ వ్యక్తి క్రీస్తుదేహంలో ఓ అవయవం - 1 కొ12, 27.