పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ సమాజాన్ని వర్ణిస్తూ "వాళ్ళు ఒకే ఆత్మ ఒకే హృదయం కలిగి వుండేవాళ్లని చెప్తుందిచ-4,32. ఈ వాక్యాలను బట్టి క్రైస్తవ మతంలోని సారం సోదరప్రేమ అని అర్థం చేసికోవాలిగదా!

3. క్రీస్తు "నేను మిమ్ము ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా యాజ్ఞ" అన్నాడు - 15,12 సువార్తలోని ఆజ్ఞలన్నీ క్రీస్తువే కదా! ఈ సోదర ప్రేమనే ప్రభువు ప్రత్యేకంగా "నా ఆజ్ఞ" అని పేర్కొనడం దేనికి? తోడి ప్రజలను ప్రేమించడమంటే ఏమిటో క్రీస్తుకు బాగా తెలుసు. "స్నేహితుల కొరకు ప్రాణాన్ని సమర్పించడం కంటె మేలైన ప్రేమ ఏముంది" అన్నాడు ప్రభువు, 15,13. ఆలాంటి ప్రేమమూర్తి సోదర ప్రేమను "నా ఆజ్ఞ" అని పేర్కొన్నాడు. కనుక యీ సోదరప్రేమ ఎంత ముఖ్యమైందో ఊహించవచ్చు గదా!

4. “తండ్రీ! నాతో నీవు, నీతో నేను ఐక్యమైయున్నట్లే వీరూ మనతో ఏకమై వుండాలి" అని శిష్యులను గూర్చిన క్రీస్తు ప్రార్థన -17,21. శిష్యుల ఐక్యతకు పోలిక తండ్రి కుమారుల ఐక్యత. తండ్రి కుమారుల ఐక్యత నిజమైంది. గాఢమైంది. ప్రేమపూరితమైంది. అలాగే క్రైస్తవ ప్రజలు కూడ ప్రేమభావంతో ఐక్యం గావాలి. ఇక్కడ దైవజీవితాన్ని దైవప్రేమను సోదరజీవితానికి సోదరప్రేమకు ఉపమానంగా చెప్పాడు ప్రభువు. అనగా సోదర ప్రేమ అంతశ్రేష్టమైంది.

కడపటి ప్రసంగంలోని పై నాలుగు వాక్యాలనుబట్టి సోదరప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో ఊహించవచ్చుగదా! ఇక ఈ సోదరప్రేమను లక్ష్యపెట్టకుండ జీవించే వాళ్ళను యధార్థ క్రైస్తవులనగలమా?

2. సోదర ప్రేమకు ఆధారం దైవప్రేమే

సోదరప్రేమ చాలా ముఖ్యమైంది అన్నాం. కాని సోదర ప్రేమను మనం ఎందుకు పాటించాలి? దేవుడు ప్రతినరుణ్ణి వ్యక్తిగతంగా ప్రేమిస్తుంటాడు. దేవునికి ప్రీతిపాత్రుడైన నరుడ్డి మనంకూడా ప్రేమించాలి. మనం తోడి నరునికి కీడుచేస్తే క్రీస్తు ఆ కీడు తనకు చేసినట్లే భావిస్తాడు. సువిశేష వాక్యాలే ఇందుకు సాక్ష్యం, మత్తయి సువిశేషం 25వ అధ్యాయం కడపటి భాగం ఓ సామెతను వర్ణిస్తుంది. ఈ సామెత ప్రకారం కొందరు క్రీస్తు శిష్యులను ఆదరించారు - 25,40. మరి కొందరు అనాదరం చేసారు - 25,45. కాని క్రీస్తు ఈ యాదరాన్నీ అనాదరాన్నీ తనకు చూపినట్లే భావించాడు. ఆ ప్రభువు తన ప్రజలమధ్య నెలకొని వుండేవాడు. తన ప్రజలతో ఐక్యమై వుండేవాడు. అతడు నూత్న వేదపు ఇమ్మానువేలు-మత్త 1,23. కనుక అతని కోసము అతని ప్రజలను ప్రేమించాలి. సోదర ప్రేమలోని రహస్యమంతా ఇదే. దాని విలువ కూడ ఇదే