పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుడు చనిపోయేపుడు పలికే తుది పలుకులు చాలా ముఖ్యమైనవి. అతని కోరికలూ ఆశయాలూ ఆ తుది పలుకుల్లో స్పష్టంగా గోచరిస్తాయి. క్రీస్తు కడపటి ప్రసంగమే అతని తుది పలుకులు. ఈ కడపటి ప్రసంగంలో ప్రభువు సోదరప్రేమను గూర్చి గూడా ప్రస్తావించాడు. అనగా ప్రభువు సోదర ప్రేమను ముఖ్యాతి ముఖ్యాంశంగా భావించాడని చెప్పాలి. ప్రస్తుతం ఈ కడపటి ప్రసంగంలోని సోదర ప్రేమను గూర్చిన వాక్యాలను కొన్నింటిని పరిశీలిద్దాం. క్రీస్తు కడపటి ప్రసంగం యోహాను 18-17 అధ్యాయాల్లో వర్ణింపబడింది.

1. ప్రభువు సోదర ప్రేమను గూర్చి మాటాడుతూ "నేను మీకు క్రొత్త ఆజ్ఞ నిస్తున్నాను" అన్నాడు - 13, 34. సోదరప్రేమ క్రొత్త ఆజ్ఞ ఎలా ఔతుంది? పూర్వవేదంలోని లేవీయకాండ “నీవలె నీ పొరుగు వారిని ప్రేమించ" మని చెప్తుంది - 19,18. మరి క్రీస్తు దీనిని "క్రొత్త ఆజ్ఞ" అనడం దేనికి? పూర్వవేదం సోదరప్రేమను గూర్చి బోధించినా సోదర ప్రేమను ఎందుకు పాటించాలో ఎక్కడా చెప్పలేదు. కాని నూత్నవేదంలో క్రీస్తు తన ప్రేమే సోదర ప్రేమకు ఆదర్శమన్నాడు. "నేను మిమ్మ ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించాలి" అని క్రీస్తుబోధ - 15, 12 క్రీస్తు మనలను ప్రేమించాడు కనుక, ఆ క్రీస్తు ప్రేమను ఆదర్శంగా పెట్టుకొని మనం తోడి ప్రజలను ప్రేమించాలి. ఈ యాదర్శమే సోదర ప్రేమకు కారణం. ఈ కారణాన్ని పూర్వవేదమెక్కడా పేర్కొనదు. యావే ప్రభువు కొరకు తోడినరులను ప్రేమించమని పూర్వవేద మెక్కడా చెప్పదు. కాని క్రీస్తు కొరకు తోడి ప్రజలను ప్రేమించమని నూత్నవేదం చెప్తుంది. ఈలా క్రీస్తు క్రొత్తగా ఓ ఆదరాన్ని ఓ కారణాన్నీ ప్రవేశపెట్టాడు. ఈ కట్టడలోని క్రొత్తతనం ఇదే.

2. "మీరు పరస్పర ప్రేమతో జీవిస్తే లోకం మిమ్ము నా శిష్యులనుగా గుర్తిస్తుంది" అన్నాడు ప్రభువు - 13,35, అనగా లోకంలోని జనులు పరస్పర ప్రేమతో జీవించరు. ఒకరంటే ఒకరికి గిట్టదు. ఒకరినొకరు అణగద్రొక్కాలని చూస్తుంటారు. "నరునికి నరుడు తోడేలు" అంటుంది ఓ రోమను సామెత, కాని క్రీస్తు శిష్యులు అలా ప్రవర్తించకుండ, ఒకరినొకరు ఆదుకుంటూ పరస్పర ప్రేమభావంతో జీవించాలి. ఈ సోదరప్రేమే క్రైస్తవ ప్రజలకు ప్రధాన లక్షణం. క్రీస్తు తనపేర అద్భుతాలు చేసేవాళ్ళ గొప్ప సాంఘికసేవ చేసేవాళ్ళూ తన్నుగూర్చి చక్కగా ఉపన్యసించేవాళ్ళూ రచనలు చేసేవాళ్ళూ తన శిష్యులు అనలేదు. మరి తనకొరకు తోడి ప్రజలను ప్రేమించేవాళ్ళ తన శిష్యులుగా గుర్తింపబడతారు అన్నాడు. ప్రాచీన క్రైస్తవ రచయిత టెరూలియన్ నాటి రోమను ప్రజలు క్రైస్తవులను గూర్చి మాటలాడుకొనే తీరును వర్ణిస్తూ "ఈ క్రైస్తవులు ఒకరినొకరు ఎంత చక్కగా ప్రేమించుకుంటున్నారో చూడండి" అని అనుకొనేవాళ్లని వ్రాసాడు. అపోస్తలుల చర్యలు కూడ యెరూషలేములోని తొలినాటి