పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తువులనుగూర్చి తలంచుకోడానికి వ్యవధియేది? కుంట అడుగునవన్నమట్టిని కదలిస్తే కుంటలోని నీళ్ళన్నీ మురికియౌతాయి గదా? ఆలాగే ఒకసారి మన నాలుకను మాటలతో కదిలిస్తే ఇక మన మనసూ హృదయమూ కూడ ఇహలోక భావాలతో మలినమైపోతాయి.

భగవత్సాన్నిధ్యాన్ని అభిలషించేవాడు తరచుగా మౌనాన్నిపాటించాలి. ఏకాంతాన్ని గూడ అభిలషించాలి. ఏకాంతంలో, మౌనంలో హృదయం ఆలోచనకు పూనుకొంటుంది. కంటికి కనుపించని భగవంతుణ్ణి ధ్యానించుకొంటుంది. ఆ పరమాత్మను దర్శిస్తుంది. కనుక దేవుడు అనుభవానికి రావాలంటే మనం వాగుడుకాయతనాన్ని తగ్గించుకొని మౌనం అలవర్చుకోవాలి.

6. కొందరికి లోకంలో జరిగే ఆయా సంగతులనూ, వాళ్లనూ వీళ్లనూ గూర్చిన రహస్యాలనూ తెలిసికోవాలనే కోరిక మిక్కుటంగా వుంటుంది. ఈ మనస్తత్వం వల్ల గూడ మనం దైవసాన్నిధ్యాన్ని గుర్తించలేకపోతూంటాం. ఈలాంటి బుద్ధి కలవాళ్లు తమ మంచి చెడ్డలు తాము అట్టే ఆలోచించి చూచుకోరు. తాము దేవుని దృష్టిలో ఏలా వున్నామా అని విచారించుకోరు. వాళ్లనీ వీళ్లనీ గూర్చి తెలిసికోగోరుతుంటారు. దీనివల్ల ఆధ్యాత్మికంగా కలిగే లాభమేమీ లేదు. మనలోని వ్యర్థ కుతూహలం మాత్రం కొంతవరకు సంతృప్తి చెందుతుంది. ఈలాగంటే మనకు లోకజ్ఞానం అవసరం లేదని కాదు. మన యిరుగుపొరుగు వాళ్లేలా వున్నారో, లోకంలో ఏమి జరుగుతుందో మనకు తప్పకుండా తెలిసివుండాలి. ఐతే మన కాలమంతా లోకవిషయాలకే వినియోగించకూడదు. అన్నింటికంటే భగవంతుడు ముఖ్యం. కనుక సజ్జనుడు సమయం దొరకినపుడుడల్లా పాపపు లోకంనుండి వైదొలగి దేవుని సన్నిధిలోకి వస్తూండాలి.

ఈ చివరి అధ్యాయంలో దైవసాన్నిధ్యాన్ని పాటించడంలో ఎదురయ్యే అవరోధాలను కొన్నిటిని పరిశీలించి చూచాం. ఈ యాటంకాలను జయిస్తే మనం దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవచ్చు.

ఉపసంహారం

ప్రభువు "నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో వసిస్తూంటాను. ఐనా వినయాత్మలూ పశ్చాత్తాప మనస్కులూ ఐన నరులతో గూడ వసిస్తూంటాను" అన్నాడు- యెష 57,15. కనుక మనం మన పొగరుబోతుతనాన్ని అణచుకొని వినయంతో జీవించాలి. మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ మనను నిర్మలంచేసికోవాలి. ఈలా ప్రవర్తిస్తే దైవభక్తి నలవర్చుకొని దేవుని సాన్నిధ్యాన్ని పొందుతాం. హానోకు, నోవా, అబ్రాహాము, యెలీషా లాంటి పుణ్యపురుషుల్లాగ దేవుని సన్నిధిలో నడుస్తాం. "ప్రభువు జ్ఞానం ప్రతి తరానా కొందరుభక్తుల నావేశించి వాళ్లను దేవుని స్నేహితులనుగాను ప్రవక్తలనుగాను మారుస్తుంది" అని చెప్తుంది సొలోమోను జ్ఞానగ్రంథం - 7, 27. దైవసాన్నిధ్యభాగ్యంవల్ల మనంకూడ ఈలాంటి భక్తులమైతే ఎంత బాగుంటుంది!