పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరికలూ నీవు గమనిస్తూంటావని తెలిసికొనినపుడు నేను సిగ్గుతోను భయంతోను కంపించిపోతాను" అని పల్మాడు అగస్టీను.

2. నేను దేవుని సన్నిధిలో నడుస్తున్నాను అని భావించేవాడు శోధనలను గూడ జయిస్తాడు. బాబిలోనులో వసిస్తూన్న యొవాకిం భార్య సూసన్నను ఇద్దరు వృద్ధులు కామించారు. వాళ్ళ నీవు మాతో పాపం చేయకపోతే మేము నీ మీద నేరంమోపి నిన్ను శిక్షకు గురిచేస్తామని బెదిరించారు. సూసన్న నేను మీ చేతికి చిక్కి మీరు పెట్టే శిక్షనైనా అనుభవిస్తానుగాని దేవుని యెదుట పాపం చేయలేను అని పల్కింది - దాని 13,23. సాన్నిధ్య బలం వలన భక్తులు శోధనలను జయించే తీరు యిది.

అగస్టీను భక్తుడు ఓ ఉపమానం చెప్పాడు. "యుద్ధభూమిలో సైన్యాధిపతి సైనికులను గమనిస్తూన్నట్లే ఈ లోకమనే యుద్ధభూమిలో పోరాడే మనలను గూడ దేవుడు గమనిస్తూంటాడు. అతడు ఒక చేతిలో వరప్రసాదాలనూ మరొక చేతిలో కిరీటాలనూ పట్టుకొని ఉంటాడు. ఆ వరప్రసాదాలు తన్ను అడుగుకొనే వాళ్ళకి. ఆ కిరీటాలు ఈ జీవితంలో చక్కగా పోరాడేవాళ్ళకి". కనుక మనం ఆపదల్లోను శోధనల్లోను అక్కరల్లోను ఆ ప్రభుని మనకు తోడ్పడమని అడుగుకోవాలి. దేవుని హృదయంలో నిల్పుకొని అతని సన్నిధిలో నడచేవాడు మహాబలాన్ని పొందుతాడు. ఆలాంటివాడు తనహృదయంలోకి ప్రవేశించగోరే పిశాచాన్నీ దాని రాజ్యాన్నీ కూడ సమూలంగా నిర్మూలించగల్గుతాడు. క్రీస్తు అనుసరణం చెప్పినట్లు, దేవుణ్ణి హృదయంలో నిల్పుకొన్నవాడూ, సృష్టివస్తువులకు హృదయాన్ని అర్పించనివాడూ నిజంగా ఆధ్యాత్మిక మానవుడు.

3. ఈ యభ్యాసాన్నిపాటించేవాళ్ళు అనతి కాలంలోనే ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధిస్తారు. దేవుడు అన్ని సృష్టివస్తువుల్లోను ఉంటాడు. మనం అన్ని వస్తువుల్లోను అతన్ని దర్శించవచ్చు. కాని అతడు ప్రధానంగా మన అంతరంగంలో ఉంటాడు. కనుక భక్తి భావంతో తమ అంతరంగంలోకి తొంగి చూచుకొనేవాళ్ళకి అతడు సులభంగా లభ్యమౌతాడు. ఈలా అంతరంగంలోనే దైవసాన్నిధ్యాన్ని గుర్తించి ఆ ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ జీవించేవాళ్ళు పరిపూర్ణ మానవులౌతారు.

ఈ సందర్భంలో క్రీస్తు అనుసరణం ఈలా నుడువుతుంది. "నన్ను ప్రేమించేవాడు నా మాట పాటిస్తాడు, అప్పుడు నేనూ నా తండ్రీ విచ్చేసి అతని హృదయంలో వసిస్తాం అని ప్రభువు మాట యిచ్చాడు. కనుక క్రీస్తుకి నీ హృదయాన్ని తెరువు. ఇతరులకు దానిలోకి ప్రవేశం నిరాకరించు. నీకు అతడు చాలు. అతడు నీ యక్కరలన్నీ తీరుస్తాడు. నీ పట్ల విశ్వసనీయుడైన స్నేహితుడుగా మెలగుతూ నిన్ను జాగ్రత్తగా కాపాడతాడు. ఇక నీవు ఎవరిమీద ఆధారపడనక్కరలేదు. అసలు దేవుడు అనుగ్రహించందే ఇతరులు నిన్ను