పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుని ప్రేమించేవాళ్ళకి ఆ ప్రభువు దక్కుతాడు. అతన్ని దక్కించుకోవడమంటే గొప్పనిధిని దక్కించుకోవడమే. మన యాత్మలు దేవునియందే ఆనందిస్తాయి. అవి ఆ ప్రభువు నుండి బయలుదేరుతాయి. ఆ ప్రభువు దగ్గరికే తిరిగిపోజూస్తాయి. చేపను నీటినుండి బయటికితీసి బంగారు పాత్రలో పెట్టినా అది చస్తుంది. ఆలాగే మన ఆత్మను భగవంతునినుండి వైదొలగించి లోకవస్తువుల్లో పెడితే అది చస్తుంది. లోకవస్తువులు ఎంత విలువగలవైనాసరే దాన్ని సంతృప్తిపరచలేవు. కనుక మనం దేవునివైపు మళ్ళాలి. అతని కంకితులమై అతన్ని ప్రేమించాలి. నీ సన్నిధిలో నేను మహానందం చెందుతాను" అన్నాడు కీర్తనకారుడు - 16,11. ఆ భక్తనికిలాగే మనకుకూడ దైవసాన్నిధ్యం ఆనందాన్ని కలిగిస్తే మన జీవితం ధన్యమౌతుంది.

5. దైవసాన్నిధ్యాన్ని పాటించడమంటే యేమిటి?

భక్తుడు దైవసాన్నిధ్యాన్ని పాటించాలని పూర్వాధ్యాయాల భావం, దైవసాన్నిధ్యాన్ని పాటించడమంటే మన హృదయంలో వసించే దేవుణ్ణి ప్రేమభావంతో జ్ఞప్తికి తెచ్చుకోవడమే. ఇక్కడ రెండంశాలు ముఖ్యం. మొదటిది, ఓ నాన్ననో స్నేహితుణిజ్ఞప్తికి తెచ్చుకొన్నట్లుగా భగవంతుణ్ణి కూడ జ్ఞప్తికి తెచ్చుకొంటాం. ఈలా చేయడంలో కష్టమేమీ వుండకూడదు. రెండవది, అతన్ని ప్రేమభావంతో జ్ఞప్తికి తెచ్చుకొంటాం. నాన్నలాంటివాడూ స్నేహితుని లాంటివాడూ ఐన దేవునితో ప్రేమతో ఐక్యంకాగోరుతాం. ఇక దేవుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. భగవంతుడు అంతటా వుంటాడు. కాని యిక్కడ అతన్ని మన హృదయంలో వున్నవాణ్ణిగా భావించుకోవాలి. అతడు మన యెదలోనే వున్నాడు అనుకొంటే మనకు భక్తీ అవధానతా పెరుగుతాయి. ఆ ప్రభువు నా హృదయంలోనే వుండగా నేనతనికోసం అనవసరంగా వెలుపల గాలించాను అన్నాడు అగస్టీను భక్తుడు. ఆ పరమాత్మ ఓ మునిలాగ మన హృదయగుహలో మననం చేసికొంటూవుంటాడని చెప్తాయి ఉపనిషత్తులు.

2. దేవుడ్డి జ్ఞప్తికి తెచ్చుకొంటే ఓ విధమైన ప్రశాంతభావం కలుగుతుంది. హృదయంలో ఏదో తీయదనంగూడ గోచరిస్తుంది. చిన్నబిడ్డ తల్లి సన్నిధిలో వున్నప్పళ్లాగ ఓ విధమైన నమ్మకం కలుగుతుంది. సాన్నిధ్యభావానికి ఈ నమ్మకమనేది చాలా ముఖ్యం. ఈ యభ్యాసాన్ని కలిగించుకోవడానికి మనం బ్రహ్మాండమైన కృషియేమీ చేయనక్కరలేదు. మనలను మనం శ్రమపెట్టుకోనక్కరలేదు. నిర్బంధపరచుకోనక్కరలేదు. ఇది అతిసులువుగా సిద్దించే అభ్యాసం, పౌలు "మనం పరలోక పౌరులం" అన్నాడు - ఎఫె 3,20. అనగా మనం ఈ లోకానికి గాక పరలోకానికి చెందినవాళ్ళం. కనుక పరలోక భావాలూ ఆధ్యాత్మిక చింతనమూ మనకు సహజంగానే కలగాలి.