పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మౌతుంటాయి. అగస్టీను నుడివినట్లు, నరుడు శరీరాన్నేగాని ఆత్మను పట్టించుకోడు. అతడు ఇంద్రియాలచే తెలిసికోదగిన భౌతిక వస్తువులనేగాని, ఆధ్యాత్మిక వస్తువులను ఆశింపడు. దేవుణ్ణి స్మరింపడు. భగవంతుడు నరుణ్ణి దేవుణ్ణి చేయగోరుతూంటే, నరుడు తన మట్టుకు తాను మృగమైపోవాలని కోరుకొంటూంటాడు.

కనుకనే కొందరు పుణ్యపురుషులు ఈ ప్రపంచాన్ని త్యజించి, ఈ సంసారాన్నిరోసి, అడవుల్లో కొండల్లో ఏకాంత జీవితం గడిపారు. అక్కడ తమకు సహచరులుగా వుండే నరులెవ్వరూ లేకపోయినా దేవుణ్ణే సహచరుణ్ణి చేసికొని ఆ ప్రభువుని ధ్యానించుకొన్నారు. అతన్ని అనుభవానికి తెచ్చుకొని పరమానందం చెందారు. ఔను, దైవసాన్నిధ్యం మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ యానందాన్నిదేవుడీయవలసిందే గాని ఈ యిహలోకవస్తువు లీయలేవు.

మనం లోకవస్తువులకు అంటిపెట్టుకొని వుంటాం గనుకనే దేవుణ్ణి గుర్తించలేకపోతుంటాం. మన ఆత్మకు పాపపు పొరలు కమ్మివుంటాయి. కనుకనే అది ఆ దివ్యజ్యోతిని దర్శించలేక పోతూంటుంది. "నిర్మల హృదయులు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు" అన్నాడు ప్రభువు - మత్త 5,8. దేవుణ్ణి దర్శించడానికి మొదటి షరతు హృదయ నైర్మల్యం. ఇక్కడ నిర్మల హృదయమంటే ఏకాగ్రతతో దేవుని మీదనే లగ్నమైయుండే హృదయం. ఇద్దరు యజమానులను సేవించని హృదయం, అనగా లోకవస్తువులను విడనాడి భగవంతుణ్ణి మాత్రమే సేవించే హృదయం — మత్త 6,24. కనుక సృష్టి వస్తువులను విడనాడి సృష్టికర్తను వెదకే మహానుభావులు ఆ పరమాత్ముణ్ణి దర్శిస్తారు.

3. అంతటా వుండే దేవుణ్ణి గౌరవించాలి

పెద్ద అధికారులముందూ, ఉద్యోగులముందూ మనం భయభక్తులు ప్రసాదిస్తాం. కాని అధికారులందరికి పై యధికారి దేవుడు, అతడు నిరంతరమూ మనకు దాపులోనే వుంటాడు. అలాంటి దేవునిపట్ల మనమెంతగానో వినయవిధేయతలూ గౌరవమర్యాదలూ ప్రదర్శించాలికదా! ఫ్రాన్సిస్ డిసేల్స్ గొప్పభక్తుడూ, బిషప్పూ ఓమారు మరో బిషప్ప ఫ్రాన్సిస్ ఏకాంతంగా వున్నప్పుడు ఏలా ప్రవర్తిస్తాడో చూద్దామనుకొన్నాడు. కనుక ఫ్రాన్సిస్ వంటరిగా తన గదిలో వున్నపుడు ఆయన్ని నిశితంగా పరిశీలించి చూచాడు. కాని ఫ్రాన్సిస్ ఎల్లపడు నేను దేవుని సన్నిధిలో వుంటానని భావించుకొనేవాడు. కనుక అతడు ఎల్లవేళలా మేరమర్యాదలతో భక్తిశ్రద్ధలతో మెలిగేవాడు. అందువల్ల ఆ భక్తుణ్ణి దర్శించేవాళ్ళకి కూడ భక్తి పుట్టేది. మనంకూడ ఈ పుణ్యాత్మునిలాగ నడచుకోవాలి. "మీరు వెలుగునకు సంబంధించిన ప్రజల్లాగ జీవించండి" అని హెచ్చరించాడు పౌలు - ఎఫె5,8. పాపాత్ములు చీకటికి సంబంధించినవాళ్ళు వాళ్ళకు దేవుడూ తెలియదు,