పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవచనంలోని బాధామయ సేవక ఘట్టాన్నుండి గ్రహించారు. ఆ సేవకుడు క్రీస్తునకు ప్రతిరూపం అన్నాం. కాని యీ సేవకుడు అతడు సూచించే క్రీస్తు "అనేకుల" పాపాలు మాత్రమే భరిస్తారా? అందరి పాపాలను భరించారా? హీబ్రూ భాషామర్యాద చొప్పన "అనేకులు" అంటే అందరూ అనే అర్థం. కనుక ఈ సేవకులు అందరి పాపాలను భరించారనే చెప్పాలి.

ఇంకో విషయం. ప్రవక్త 53,7 లో “వధించడానికై తోలుకొనిపోయే గొర్రెపిల్లలా అతడు మౌనంగా వుండి పోయాడు" అంటాడు. స్నాప్రకయోహాను క్రీస్తును చూచి "ఇదిగో లోకముయొక్క పాపాలను భరించే గొర్రెపిల్ల" అన్నపుడు బహుశః పై ప్రవక్త వాక్యంలోని "గొర్రెపిల్ల" శబ్దాన్ని సూచించి వుండవచ్చు - యోహా 1,29.

51. శ్రమ లనుభవించాక మహిమ = లూకా 24, 26 - 27

క్రీస్తు ఉత్దానానంతరం ఇద్దరు శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళూన్నారు. క్రీస్తుకూడ వాళ్ళతో ప్రయాణం చేసాడు. కాని వాళ్ళ క్రీస్తును గుర్తుపట్టలేదు. తాము అనుసరించిన క్రీస్తు రోమను బానిసాన్నుండి పాలస్తీనా దేశానికి దాస్యవిముక్తి కలిగిస్తాడనుకున్నారు. కాని క్రీస్తు అదేమీ చేయకుండానే చనిపోవడంవల్ల నిరుత్సాహం చెందారు. వాళ్లు త్రోవలో ప్రయాణం చేసూండగా ప్రభువు, క్రీస్తు శ్రమ లనుభవించి అటుపిమ్మటల మహిమలో ప్రవేశించాలని ప్రవక్తలు వచించారనీ ఆ వచనం ప్రకారమే క్రీస్తు శ్రమలనుభవించి చనిపోయాడనీ వివరించాడు. ఇక్కడ క్రీస్తు పేర్కొనిన ప్రవక్తలు యెవరు? విశేషంగా యెషయా 53. కనుక ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుడను నేనేనని క్రీస్తు శిష్యులకు వివరించాడు. క్రీస్తు మన బాధామయ సేవకుడనే యీ సత్యాన్ని జీర్ణం చేసికుందాం.

52. ఈసాకు బంధనం = ఆది 22,10.

బాధామయ సేవకునితోపాటు ఈసాకు గూడ క్రీస్తుకు సూచనంగా వుంటాడన్నాం. అబ్రాహాము మోరీయా పర్వతంమీద ఈసాకును బంధించి దేవునికి బలీయడానికి సంసిద్దుడయ్యాడు. ఈ ఈసాకు బంధనాన్ని యూదులు ఓ బలిగానే భావించారు. యావే ఈసాకు బంధనాన్నిస్మరించుకొని యూదులను రక్షిస్తానని అబ్రాహాముతో వాగ్దానం చేసాడు - లేవీ 26,42. కనుక తరువాత వచ్చిన యూదులు కష్టాల్లో యావేను మనవిచేసి, ప్రభూ! ఈసాకు బంధనాన్ని స్మరించుకొని మమ్మ కాపాడమని ప్రార్థించేవాళ్లు. ఇక, అంత్యభోజన సందర్భంలో ప్రభువు "దీన్ని నాజ్ఞాపకార్థం చేస్తుండండి" అన్నాడు. — లూకా 22, 19. తొలిరోజుల్లోని యూద క్రైస్తవులకు ఈ వాక్యంలోని "జ్ఞాపకార్థం" అనే శబ్దం తప్పకుండ ఈసాకు బలిని స్మరణకు తెచ్చివుండాలి. యావే ప్రభువు ఈసాకు బలిని స్మరించుకొని యూదులను కాపాడినట్లే, క్రీస్తు బలిని స్మరించుకొని మనలను కాపాడతాడు. ఈ భాగ్యంకోసం ప్రార్థిద్దాం.