పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసిందని భావం. ఈ పుణ్యమూర్తులు నిత్యం ప్రభుసన్నిధిలో నిలుస్తారు. ఆయనను సేవిస్తారు. వారికిక వ్యాధిబాధలంటూ వుండవు. గొర్రెపిల్ల తానే కాపరీ నాయకుడూ ఐ వాళ్ళను జీవజలా లుబికే బుగ్గ దగ్గరకు నడిపించుకొని పోతుంది. ఈలా మోక్షం, పాపం చేయకముందు ఆదిదంపతులు నివసించిన మరో ఏదెను లాంటిది ఔతుంది. కనుక దర్శన గ్రంథం వెలువరించే ఈ భావం ప్రకారంకూడ క్రీస్తు పాస్క గొర్రెపిల్లలాగా మన పాపాలను పరిహరిస్తాడని స్పష్టమౌతుంది. ప్రభువు మనకూ కాపరీ నాయకుడూ గావాలని అడుగుకుందాం.

35. నిబంధన రక్తం - నిర్గ 24, 2-8.

మీద పాస్క గొర్రెపిల్లను గూర్చి వివరించాం. ఇక నిబంధన రక్తాన్నిగూర్చి ఆలోచిద్దాం. క్రీస్తు చిందించిన రక్తం యీ నిబంధన రక్తాన్నిగూడ తలపిస్తూవుంటుంది. ఈ నిబంధన రక్తం నిర్గమకాండ 24, 3-8 వాక్యాల్లో వర్ణింవబడింది. యిస్రాయేలీయులంతా సీనాయి కొండవద్ద గుమిగూడారు. యావేమాట పాటిస్తామని ప్రమాణం చేసారు. అంతట పరిచారకులు కోడెలను వధించి నెత్తురు ప్రోగుచేసారు. మోషే ఆ నెత్తురులో సగబాలు బలిపీఠంమీద చిలకరించాడు. మిగతా సగం ప్రజలమీద చల్లాడు. ప్రభువు నేడు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తం యిదేనని వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. కనానీయులు మొదలైన యిస్రాయేలీయులనాటి అన్యజాతి ప్రజలు అర్పించే బలుల్లో బలిపశువును వధించి దేవునికి సమర్పిండం ముఖ్యాంశం. కాని యిప్రాయేలీయులు అర్పించే బలుల్లో బలిపశువు నెత్తురును చిలకరించడం ప్రధానాంశం. క్రీస్తుప్రభువు చిందించిన నెత్తురు మనలనూ దేవుని చెంతకు చేర్చాలని అడుగుకుందాం.

36. నిబంధనరక్త భావం

మోషే నెత్తురును ప్రజలమీద పీఠంమీద చిలకరించాడన్నాం. ఇక్కడ పీఠం దేవునికి నిదర్శనంగా వుంటుంది. కనుక అతడు దేవునిమీద, ప్రజలమీద నెత్తురు చిలకరించాడు అనాలి. దేవుడు - ప్రజలు అనే యీ రెండు పక్షాలను నెత్తురు ఐక్యం చేస్తుంది. ఆనాడు వివిధ జాతిప్రజలు స్నేహసంబంధాలను కుదుర్చుకునేప్పడు ఇరు పక్షాలవాళ్ళ తమ నెత్తురు తీసి కలిపివేసేవాళ్లు, ఆ నెత్తురు నుండి యికమీదట ఏక ప్రాణం ఏర్పడుతుందని వాళ్ళభావం. అనగా వాళ్ళ పరస్పర ప్రేమభావంతో ఏకవ్యక్తిలా జీవిస్తారని అర్థం. నెత్తురులో ప్రాణముంటుంది. ప్రాణంతో గూడిన యీ నెత్తురును మోషే దేవునిమీద ప్రజల మీద చల్లాడు. ఈ నెత్తురులో వున్న ప్రాణం ద్వారా ఆ రెండు