పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వవేదంలోనే ప్రాయశ్చిత్తం అనే పదానికి విజ్ఞాపన ప్రార్ధనమనే అర్ధంవుంది అన్నాం. హెబ్రేయ పత్రికాకారుడూ ఈ యర్ధాన్నే స్వీకరించాడు. కావుననే ఇదేపత్రిక 5,7 లో “అతడు నరుడైయున్నపుడు మహా రోదనంతో కన్నీళ్ళతో దేవునకు ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు" అని చెపుతుంది. ఈ వాక్యాలు క్రీస్తు ఒలివేతు తోపులోను సిలువమీదను బాధలనుభవిస్తూ మన కోసం చేసిన ప్రార్థనలను సూచిస్తాయి. క్రీస్తు ఉత్థాన మయ్యాక గూడ పిత యెదుట మన కోసం విజ్ఞాపనం చేస్తూంటాడు - 7, 25. క్రీస్తు చిందించిన రక్తం ఆనాడు హేబెలు చిందించిన రక్తంకంటే అధికంగా మన తరపున మొరవెడుతుంది -12,25. ఈ చివరి వాక్యంలో గూడ నెత్తురు చిందించిన ప్రాయశ్చిత్తం చేయడమంటే విజ్ఞాపన ప్రార్ధనం చేయడమనే భావం. మోక్ష క్రీస్తు విజ్ఞాపనం మనలను పాపాన్నుండి రక్షిస్తూండాలని అడుగుకుందాం.

29. అతడే మన పాపాలకు ప్రాయశ్చిత్తం = 1 యోహా 2,2.

}}

"ఎవరైన బలహీనతవల్ల పాపంచేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మోక్షంలో తండ్రిచెంత వుండనే వున్నాడు. అతడే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు" అంటుంది 1 యోహాను 2,2. ఈ వాక్యంలో చాలా భావాలున్నాయి. (1) యేసుక్రీస్తు "నీతిమంతుడు". ఇక్కడ నీతిమంతుడంటే మన పాపాలను క్షమించేవాడు. మనకు రక్షణమనే నీతిని అనుగ్రహించేవాడు. ఈ పత్రిక 1,9 లో గూడ ఇదే భావం కన్పిస్తుంది. (2) ఈ యేసుక్రీస్తు "ఉత్తరవాది". శత్రువులు న్యాయస్థానంలో మనపై నేరం ఆరోపించినపుడు మన తరపున వాదించేవాడు ఉత్తరవాది. అతడు శత్రువు తెచ్చిన అభియోగంనుండి మనలను కాపాడతాడు. ఇక్కడ మన శత్రువెవరు? దర్శన గ్రంథం 12,10 'రేయింబవళ్ళు మన సోదరులమీద నేరం మోపే సైతానుని కూలద్రోసారు" అంటుంది. ఈ దర్శన గ్రంథకర్త జకర్యా 3,1 నుండి ఈ భావాన్ని గ్రహించాడు. మన మీద నేరం మోపే శత్రువు పిశాచమే. ఈ పిశాచాన్నుండి, అతడు మోపే నేరాన్నుండి క్రీస్తు మనలను రక్షిస్తాడు. అందుకే 1 యోహా 3,8 కూడ "పిశాచం క్రియలను నాశం చేయడానికే క్రీస్తు ప్రత్యక్ష మయ్యాడు" అని చెప్తుంది. (3) క్రీస్తు మోక్షంలో మనకొరకు తండ్రి యెదుట ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఎలా ప్రాయశ్చిత్తం చేస్తాడు? మన పాపాలను శుద్ధిచేయడం ద్వారా. మోక్ష క్రీస్తుచేసే ఈ శుద్ధి, ప్రాయశ్చిత్తం, మరేమోకాదు, అతని విజ్ఞాపన ప్రార్ధనమే! కిప్పూరు రోజున నెత్తురు చిలకరించడం ద్వారా పూర్వవేదప్రజలు శుద్ధి పొందుతారు. కనుక పిశాచం వాళ్ళపై ఇక నేరం మోపలేకపోయింది. ఇదేవిధంగా నూత్న వేదప్రజలూ మోక్షక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన ద్వారా శుద్ధిపొందుతారు. కనుక ఇక వీళ్ళనూ పిశాచం అధిక్షేపించలేదు. మోక్షక్రీస్తు మనలనూ పిశాచంనుండి కాపాడుతూండాలని అడుగుకుందాం.