పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిక్కడ "ఖరీదు” అని పేర్కొనబడింది. అనగా క్రీస్తు నెత్తురుచేత రక్షింపబడినవాళ్ళు క్రీస్తు ప్రజల్లాగే మెలగుతూండాలనీ, పాపాన్ని విసర్జించి దివ్యజీవితం జీవిస్తూండాలనీ భావం.

60. అతడు మన పాపాలకు శాంతి చేసేవాడు = 1 యోహా 2,2.

ఒకమారు క్రీస్తుబోధ అర్థంచేసికొని, జ్ఞానస్నానం పుచ్చుకొని, పరిశుద్దాత్మను పొందాక మళ్లా పాపంలో పడిపోయినట్లయితే అలాంటివాళ్ళ మనసు త్రిప్పడం అసాధ్యమంటుంది హెబ్రేయుల పత్రిక - 6, 6. ఇలాంటివాళ్ళు తమపాపంద్వారా క్రీస్తును మళ్ళా సిలువ వేస్తారు. ఈ వాక్యం అలవాటు ప్రకారం చేసే మామూలు పాపాలనుగాక, క్రీస్తును నిరాకరించి క్రైస్తవమతంలో నుండి వైదొలగిపోవడమనే పాపాన్ని పేర్కొంటుంది. మనం ఈలా క్రైస్తవమతం నుండి వైదొలగిపోంగాని, జ్ఞానస్నానం పుచ్చుకొని పరిశుద్దాత్మను పొందాకగూడ బలహీనతవల్ల మళ్ళామళ్ళా పాపం చేస్తుంటాం. ఇలా చేయకూడదు. కాని బలహీనతవల్ల పాపంచేసామో ఒక్కొటే ఒక్క శరణ్యం, మళ్ళా క్రీస్తే మన పాపాలను పరిహరించాలి. ఆ ప్రభువు దయామయుడు కనుక మన పాపాలకు శాంతి చేయడానికి సిద్ధంగానే వుంటాడు -1 యోహా 2,2. కావున ఆ ప్రభువునెదుట మన పాపాన్ని ఒప్పకొని క్షమాపణం పొందుతూండాలి. పైగా, మన నిజాయితీని చూపించడం కోసం రోజురోజూ “తండ్రీ, మా పాపాలను క్షమించు అని ప్రార్ధిస్తునే వుండాలి" - లూకా 11,4

61. ఆ కృపాసింహాసనం వద్దకు వెళ్లాం - హెబ్రే 4,16,

హెబ్రేయ పత్రికాకర్త క్రీస్తు దేవదూతల కుటుంబంలో పుట్టివుండవచ్చు గదా, నరుల కుటుంబంలోనే యెందుకు పుట్టాలి అని ప్రశ్న వేసికొని, అన్ని విషయాల్లోను తన సహోదరుల వంటివాడు కావడం కోసం అని జవాబు చెప్పాడు - 2, 17. క్రీస్తు అచ్చంగా మనలాంటివాడు. మనలా శోధింపబడ్డాడు, మనలా శ్రమ పొందాడు. కనుక నేడు శోధింపబడే మనకూ సహాయం చేయగలడు, చేస్తాడు - 3,18. అతడు మనలాగే నరుడు గనుక నరులమైన మన బలహీనతలను అర్థం చేసికుంటాడు. మన బలహీనత పట్లా శోధనలపట్లా, పాపాలపట్లా, కోపాన్నిగాదు కనికరాన్నేచూపుతాడు. ఉత్థాన క్రీస్తు మోక్షంలో తండ్రిచెంత మన తరఫున అమరియున్న కృపాసింహాసనం. మనం చనువుతో యీ కృపాసింహాసనాన్ని సమీపిస్తువుండాలి. నమ్మికతో ఈ యుత్తానక్రీస్తును ప్రార్ధించి సమయోచితమైన సహాయాన్ని పొందుతూండాలి. ఆయా యాపదలనూ శోధనలనూ జయించడానికి అవసరమైన వరప్రసాదాన్నీసహాయాన్నీ ఉత్థాన క్రీస్తు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు - 4,14-16,