పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146. సహాయుడైన దేవునికి స్తుతి

ఇది స్తుతిగీతం. కీర్తనకారుడు నరమాత్రులను నమ్మవద్దనీ వారిమీద ఆధారపడవద్దనీ హెచ్చరించాడు. అల్పాయుష్ముడైన నరుడు మనకేమి సాయం చేస్తాడు? మనం సృష్టికరా సర్వశక్తిమంతుడు ఐన దేవుని మీద ఆధారపడాలి. ప్రభువు దయగలవాడు. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టేవాడు. క్రుంగిపోయినవారిని లేవనెత్తేవాడు. పరదేసులు వితంతువులు అనాథశిశువులు మొదలైన బలహీన వర్గాలను ఆదరించేవాడు. అలాంటి ప్రభువుని మనం కూడ స్తుతించాలి, శరణువేడాలి.

147. మహోన్నతుడైన ప్రభువు

ఇది స్తుతిగీతం. దేవుడు మంచివాడు. బాబిలోనియాకు ప్రవాసులుగా వెళ్ళిన యిప్రాయేలు ప్రజలను మళ్ళా స్వీయదేశానికి తీసికొనివచ్చాడు. వారి గాయాలకు కట్టుగట్టి వారి బాధలు తొలగించాడు. ప్రభువు ప్రాణిపోషకుడు. సకాలంలో వానలు కురిపించి పంటలు పండించి ప్రాణులను కాపాడేవాడు, కావుకావుమని అరచే కాకిపిల్లలకు తిండిపెట్టేవాడు. మన బలాన్నీ గొప్పతనాన్నీ అతడు మెచ్చుకోడు. ఆజ్ఞలు పాటిస్తూ తనపట్ల భయభక్తులు చూపేవారంటే అతనికి ఇష్టం. అతడు యిస్రాయేలుకు ఆజ్ఞలు ప్రసాదించాడు. అతని కట్టడల ప్రకారం జీవించే భాగ్యాన్ని అడుగుకొందాం.

148. విశ్వం దేవుని స్తుతించాలి

ఈ కీర్తనలో భక్తుడు విశ్వాన్నంతటినీ దేవుణ్ణిస్తుతించడానికి ఆహ్వానిస్తున్నాడు. అతడు మొదట దేవదూతలను స్తుతికి ఆహ్వానించాడు. తర్వాత సూర్యచంద్రులు ఆకాశం ప్రకృతివస్తువులు నదులు మొదలైన వాటిని దైవస్తుతికి ఆహ్వానించాడు. ఈ కీర్తనలోని ప్రధానాంశం దైవస్తుతి. భూమ్యాకాశాలు నరులు దేవుణ్ణిస్తుతించడానికే వున్నాయి. స్తుతి ప్రార్థన, ఆరాధన కూడ. మన జీవితమంతా ఎడతెగని దైవస్తుతి కావాలి.

149. విజయగీతం

ఈ కీర్తనలో భక్తుడు, ప్రభువు యిస్రాయేలును రక్షించినందుకు అతన్ని స్తుతించమని చెప్పాడు. ప్రభువు దీనులైన యిస్రాయేలును ఈజిప్టు బానిసం నుండి కాపాడాడు. ఆలాంటి దేవుణ్ణి ఎల్లరూ కొనియాడాలి.

150. అంత్యస్తుతి

ఈ కీర్తనలో భక్తుడు నరులెల్ల దేవుణ్ణిస్తుతించాలని చెప్తున్నాడు. విశేషంగా భక్తులు దేవాలయారాధనలో అతన్నిస్తుతించాలి. సంగీత వాద్యాలతో, పవిత్ర నాట్యంతో అతన్ని వందించాలి. భగవంతుడు ఎల్లరిస్తుతికీ పాత్రుడు. అతన్ని కొనియాడ్డమే మన ప్రధాన ధ్యేయం.