పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలిలాగా దేవునికి ప్రీతిపాత్రం కావాలని కోరుకొన్నాడు. ఇవన్నీ పవిత్రమైన భావాలు. ఈ సజ్జనుని భక్రీ, నిజాయితీ మనకు కూడ అలవడాలని వేడుకొందాం.

142. ఆపదనుండి తప్పకోవడానికి ప్రార్థన.

ఇది విలాప కీర్తన. భక్తుని శత్రువులు బాధించారు. అతన్ని పట్టుకోవడానికి బోను పెట్టారు. ఇరుగుపొరుగు వాళ్ళల్లో అతన్ని కాపాడేవాడు ఎవడూ లేడు. కనుక అతడు ప్రభుని శరణు వేడాడు. ఈ నేలమీద నీవు తప్పితే నన్నాదుకొనేవాడు ఎవడూ లేడని వచించాడు. నీవు నన్ను కాపాడు, నీ భక్త సమాజం ముందు నేను నీ వుపకారాలను చాటి చెప్తానని పల్కాడు. మనం కూడ ఆపదల్లో నమ్మకంతో ప్రభుని ఆశ్రయించాలి.

143. దైవసహాయం కొరకు ప్రార్ధన

ఇది ఆపదలో చిక్కిన భక్తుని విలాపగీతం. శత్రువు అతన్ని పీడించడం మొదలెట్టాడు. అతడు మిగుల క్రుంగిపోయాడు. తన వేదనలో పూర్వం ప్రభువు తనకు చేసిన ఉపకారాలను జ్ఞప్తికి తెచ్చుకొని అతనిపట్ల నమ్మకం పెంచుకొన్నాడు. ఎండిన నేల వాన చినుకులకులాగ తానూ ప్రభు దర్శనం కొరకు దప్పికగొన్నాడు. అతని సహాయాన్ని కోరుకొన్నాడు. తాను నడవవలసిన త్రోవను చూపించమని వేడుకొన్నాడు. దేవుని ఆత్మ తన్ను తిన్నని మార్గంలో నడిపించాలని మనవిచేసికొన్నాడు. మన కష్టాల్లో మనం కూడ ఇదే రీతిగా ప్రభువుకి ప్రార్థన చేసికోవాలి.

144. విజయ గీతం

ఈ కీర్తన చెప్పిన రాజు మొదట ప్రభువు తనకు యుద్ధంలో విజయం దయచేసినందుకు అతనికి వందనాలు చెప్పాడు. దేవుడు తనకు ఆశ్రయస్థానం, దుర్గం, డాలు అని వాకొన్నాడు. తర్వాత నరుని, అల్పత్వాన్నివర్ణించాడు. సకలాపదల్లోను దేవుడు తన్ను కాపాడాలని కోరుకొన్నాడు. కడన తనకూ తన ప్రజలకూ సిరిసంపదలూ శుభాలూ కలగాలని వేడుకొన్నాడు. యువతీయువకులు బలంగా ఎదగాలి. పొలాల్లో పంటలు బాగా పండాలి. పశుగణం విస్తరిల్లాలి. ఇవి అతని కోర్కెలు. మనకు కూడ ప్రభువు దీవెనలు లభించాలని వేడుకొందాం.

145. రాజైన ప్రభువుకి స్తుతిగీతం

ఈ కీర్తన దేవుణ్ణి రాజుగా ఎంచుతుంది. అతడు చేసిన అద్భుత కార్యాలనూ సృష్టినీ వర్ణిస్తుంది. అతని ప్రాణిపోషణా చాతుర్యాన్ని కొనియాడుతుంది. అతని మంచితనాన్ని స్తుతిస్తుంది. ప్రభువు అద్భుత కార్యాలు అందరు కొనియాడతారు. అతని రాజ్యం శాశ్వతంగా నిలుస్తుంది. అతడు పడిపోయినవారిని లేవనెత్తే దయామయుడు. అమ్మా నాన్నలాగ ప్రాణికోటికి తిండిపెట్టి వాటి ఆకలి తీర్చేవాడు. తనకు మొరపెట్టేవారికి చేరువలోనే వుండి వారి అక్కరల తీర్చేవాడు. ఈలాంటి దయామయుడైన ప్రభువుని మనం కూడ స్తుతించాలి.