పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంతోమంది పరపీడనకు గురౌతున్నారు. ఈ పేదసాదలనూ దీనులనూ రక్షించడానికి ప్రభువు మనలను వినియోగించుకొంటాడు. మనద్వార పేదలకు విమోచనం కలిగిస్తాడు. మన తరపున మనం సమాజంలోని అన్యాయాలను ఎదిరించడానికి సిద్ధంగా వండాలి.

130. హృదయాంతరాళం నుండి

ఇది పశ్చాత్తాపాన్నితెలియజేసే విలాపగీతం. ఈ కీర్తనలో భక్తుడు తన పాపాలను మన్నించమని దేవునికి మొరపెడుతున్నాడు. రాత్రివేళ మేల్కొని వున్న కావలివాళ్లు వేకువజాము కొరకు కనిపెట్టుకొని వుంటారు. అలాగే కీర్తనకారుడు దేవుని రక్షణం కొరకు కనిపెట్టుకొని వున్నాడు. ప్రభువు తన్ను మాత్రమేగాక యిప్రాయేలీయులందరినీ పాపం నుండి రక్షించాలని ఈ పుణ్యాత్ముని కోరిక. నేడు ఈ కీర్తనను మృతుల పూజలో జపిస్తాం. ప్రభువు చనిపోయినవారి పాపాలను పరిహరించాలని వేడుకొంట. నూత్న వేదంలో మన పాపాలకు పరిహారం చేసి మనకు రక్షణాన్ని ప్రసాదించేవాడు క్రీస్తు. ఆ ప్రభువు నుండి మనం నిరంతరం రక్షణాన్ని అడుగుకోవాలి.

131. పసిబిడ్డ వాలకం

ఈ కవి నేను గొప్పవాడ్డి కావాలి అనుకొన్నాడు. గొప్ప కోరికలు పెట్టుకొన్నాడు. గొప్ప ప్రయత్నాలు కూడ చేసాడు. కాని విఫలుడయ్యాడు. అప్పడు వినయాన్ని అలవర్చుకొన్నాడు. దేవునిమీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టాడు. దేవునిపట్ల పసిబిడ్డలా మెలగడం నేర్చుకొన్నాడు. దీనితో అతని హృదయం కోరికలన్నీతీరి శాంతిని పొందింది. అతడు పాలు మాన్పించిన శిశువు తల్లిరొమ్ముమీద ప్రశాంతంగా పండుకొని వున్నట్లే నేనూ దేవుణ్ణి నమ్మాను అని చెప్పకొన్నాడు. ఇతడు "హనవిం" అనబడే దీనుల వర్గానికి చెందినవాడు. ఇతన్ని చూచి మనం కూడ అహంకారాన్ని విడనాడాలి. దేవునిపట్ల చిన్న బిడ్డలంగా దీనులంగా మెలగడం నేర్చుకోవాలి. చిన్న తెరేసమ్మ చిన్నమార్గం ఇదే.

132. మందసాన్ని సియోనుకి కొనిరావడం

దావీదు యెరూషలేములో ప్రభువుకి దేవాలయం కట్టించాలనుకొన్నాడు. మందసాన్ని వైభవంగా నగరానికి కొనివచ్చాడు. కాని ప్రభువు అతనితో నీవు కాదు నీ కుమారుడు దేవాలయాన్ని కడతాడని చెప్పాడు. అతడు సియోనుని తన నివాసంగా ఎన్నుకొన్నాడు. ఇక్కడే తర్వాత సాలోమోను దేవళం కట్టాడు. ఇక్కడే దావీదు రాజవంశజులు పరిపాలనం చేసారు. తర్వాత మెస్సీయా దావీదు కుటుంబం నుండే వచ్చి ఈ పట్టణంలోనే ఆత్మార్పణం చేసికొన్నాడు. ఈ విధంగా యెరూషలేము రక్షణ కేంద్రమైంది. నేడు ప్రభువు తిరుసభలో వసిస్తుంటాడు. మనందరి హృదయాల్లోను నెలకొని వుంటాడు. మన హృదయమందిరంలో వసించే ఆ దివ్యమూర్తిని వందిద్దాం.