పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతనికి ఎంతో ఆనందం కలిగింది. అతడు నగరాన్ని వీడి ఇంటికి వెళ్ళకముందు దానికి శాంతీ శుభమూ కలగాలని ప్రార్థించాడు. అతని బంధుమిత్రులు ఆ పట్టణంలో వసిస్తున్నారు. వారిని మనసులో పెట్టుకొని గూడ ఆ నగరానికి మేలు కలగాలని కోరాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవళాన్ని స్మరించుకొని యెరుషలేముకి శుభం కలగాలని జపించాడు. కీర్తనకారునికి పవిత్ర నగరమూ దేవాలయమూ అంటే యెంత భక్రో ఈ కీర్తన తెలియజేస్తుంది. మన దేవాలయం పట్ల మనకున్న భక్తి ఏపాటిది? మనం ఎంత కోరికతో గుడికి వెళ్తుంటాం?

123. పీడితుల ప్రార్ధనం

ఇది బృంద విలాపం. యూదులు పీడకుల బాధకు గురైనపుడు చెప్పిన గీతం, సేవకులు సేవికలు తమ యజమానుని కరుణకొరకు కాచుకొని వుంటారు. అలాగే భక్తులు కూడ దేవుని దయకొరకు కాచుకొని వుంటారు. విడుదల ప్రభువునుండి మాత్రమే లభిస్తుంది. ఆ ప్రభువు దీనులను ఆదుకొనితీరతాడు. మనం కూడ ఈలాంటి నమ్మకంతోనే ఆపదల్లో దేవునికి మొరపెట్టాలి.

124. యిస్రాయేలు రక్షకుడు

యిప్రాయేలు చిన్న రాజ్యం. ఈజిప్టు, బాబిలోనియా, పర్షియా, గ్రీసు, రోము లాంటి పెద్దరాజ్యాలు శతాబ్దాల పొడుగునా దాన్ని ఏలాయి. దేవుడు కాపాడబట్టి యూదులు నిల్చారు కాని లేకపోతే ఏనాడో అణగారిపోయేవాళ్లే అంతమంది పీడకులకు చిక్కినా యూదులు నాశమైపోకుండడం చరిత్రకారులకే ఆశ్చర్యం కలిగించింది. ఈ కీర్తనలో “దేవుడు మనపక్షాన వుండకపోతే శత్రువులు మనలను మింగివేసేవాళ్లే" అని భక్తుడు కృతజ్ఞతా భావంతో విన్నవించుకొన్నాడు. యిస్రాయేలు జనం పక్షుల్లాగ శత్రువులు పన్నిన ఉచ్చులో చిక్కుకొన్నారు. కాని దేవుడు ఆ వచ్చును బ్రెంచి వాళ్లు తప్పించుకొని పోయేలా చేసాడు. ఆపదలు ప్రమాదాలు గొడవలు మొదలైన వాటినుండి బయటపడినప్పుడు మనం కూడ దేవుడే సహాయం చేసాడని నమ్మికృతజ్ఞతాభావంతో ఈ గీతాన్ని జపించవచ్చు

125. భక్తులను కాచే ప్రభువు

సియోను అంటే యెరూషలేము. సియోను కొండమీదనే యెరూషలేము పట్టణాన్నీ దేవాలయాన్నీ కట్టారు. యెరూషలేము చుటూ చిన్నకొండలు వ్యాపించి వున్నాయి. అవి ఆ నగరానికి రక్షగా వుంటాయి. కొండలు యెరూషలేమని కాపాడినట్లే దేవుడు యిస్రాయేలుని కాపాడతాడు. కనుక వాళ్ళకు ముప్పలేదు. మన జీవితంలో గూడ దేవుడు కొండంత అండగా వుంటాడు. కనుక అతనికి వందనాలు అర్చిద్దాం.