పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51. పాపక్షమకై ప్రార్ధనం

ఇది విలాప కీర్తనం. గొప్ప పశ్చాత్తాప భావాలు కలది. ఈ పాట చెప్పిన భక్తుడు తన పాపజీవితాన్ని రోసి భగవంతుని ముందు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడ్డాడు. నా పాపాలను తుడిచివేయ, నన్ను కడిగి శుద్ధిచేయి అని వేడుకొన్నాడు. నేను నీకే ద్రోహంగా పాపం చేసాను అని చెప్పకొన్నాడు. నాలో నిర్మల హృదయాన్ని సృజించు అని మనవి చేసికొన్నాడు. బలిపశువునిగాక పశ్చాత్తాప పూరితమైన హృదయాన్ని నీ కర్పిస్తున్నానని వాకొన్నాడు. ఈ భక్తునిలాగా మనం కూడ మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి. ఆ ప్రభువు మననుండి కోరేది వినయమూ, పశ్చాత్తాపం. ఈ భాగ్యాలను దయచేయమని ప్రభువునే అడుగుకొందాం.

{[center|

52. దుషుడికి పట్టే దుర్గతి

}}

ఇది హెచ్చరిక కీర్తన. ఎవడో దుష్టాధికారి ఓ నియంతలాగ రచయితను పీడించాడు. రచయిత రెచ్చిపోయి ఈ కీర్తన చెప్పాడు. నీవు దౌష్ట్యంతో విర్రవీగనేల అని అతడు ఈ నియంతను మందలించాడు. ప్రజలను నాశంజేసే నిన్ను ప్రభువే నాశం జేస్తాడని హెచ్చరించాడు. మనం ధనబలం, అధికార బలం, కులబలం చూచుకొని పేదలను పీడిస్తాం. దీనివలన ప్రభువు శిక్షను కొనితెచ్చుకొంటాం. కనుక మన జీవితంలో పరపీడనానికి పాల్పడిన సందర్భాలను తలంచుకొని పశ్చాత్తాపపడదాం. తరచుగా ఇతరులు మనకు కీడు చేసారని వాపోతాం. కాని మనం ఇతరులకు ఎన్నిసార్లు కీడు చేసామో ఆలోచించనే ఆలోచించం.

53. దేవుని నమ్మనివాళ్లు

యూదులంతా ఆస్తికులే. వారిలో నాస్తికులు ఎవరూ లేరు. కాని దేవుడున్నాడని నమ్మినా కొందరు యూదులు మాత్రం దేవుడు లేడో అన్నట్లుగా పాపకార్యాలకు ఒడిగట్టేవాళ్లు. దేవుడు తమ్ముపట్టించుకోడులే అన్నట్లు బరితెగించి దుష్కార్యాలు చేసేవాళ్లు భక్తుడు ఈ కీర్తనలో ఈలాంటి పాపులను పేర్కొన్నాడు. పాపకార్యాలను మానుకొమ్మని తన నాటి ప్రజలను హెచ్చరించాడు. పేదసాదలకు కీడు చేయవద్దని మొరపెట్టాడు. మనం కూడా కొన్ని పర్యాయాలు దేవునిపట్ల భక్షిజూపం. ఆధ్యాత్మిక విషయాల్లో పట్టీపట్టనట్లుగా వుండిపోతాం. అసలు దేవుడు లేడో అన్నట్లుగా పాపకార్యాలకు పూనుకొంటాం. ఈలాంటి తప్పిదాలకు పశ్చాత్తాప పడదాం.