పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44. శ్రమల్లో ప్రజల ప్రార్ధనం

ఇది విలాపకీర్తనం. యిప్రాయేలీయులకు ఏదో యుద్ధంలో అపజయం కలిగింది. వాళ్ళకు ప్రభువే తమ్ము శత్రువుల చేతికి అప్పగించాడనే తలంపుకూడ కలిగింది. కనుక ఆ ప్రజలు దేవళంలోకి వచ్చి దేవునికి మనవి చేసారు. దేవా! నీవు మోషే యోషువాల కాలంలో మాకీ గడ్డ నిచ్చావు. నీవే మా శత్రువులను అణచివేసావు. ఇప్పుడు మాత్రం మమ్మ అనాదరంజేసి విరోధుల వశంజేసావు అని విన్నపం చేసారు. ప్రభువు శీఘ్రమే తమకు సాయంజేయాలని వేడుకొన్నారు. మనంకూడ మన శ్రమల్లో "ప్రభూ లే! మమ్మాదుకోవడానికి శీఘ్రమే విచ్చేయి" అని మనవి చేసికోవాలి.

45. రాజ వివాహ గీతం

ఇది ఓ యిస్రాయేలు రాజు వివాహ సందర్భములో పాడిన పాట. దీనిలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగంలో కవి రాజుని స్తుతించాడు. అతనికి విజయం కలగాలనీ కీర్తిప్రతిష్టలు అబ్బాలనీ ఆశీర్వదించాడు. రెండవ భాగంలో రాజవధువుకి స్వాగతం చెప్పాడు. కుమారీ! ఇక నీవు నీ పుట్టింటిని మరచిపోయి ఈ రాజు అండదండల్లో వుండిపొమ్మని చెప్పాడు. మూడవ భాగంలో రాజుకి సంతానం కలగాలని దీవించాడు. పూర్వవేద భావాల ప్రకారం దేవుడనే వరుడు యిస్రాయేలు అనే వధువును భార్యగా స్వీకరించాడు. కనుక ఇది క్రమేణ మెస్సియాకు పూర్వవేద ప్రజలకు వర్తించే కీర్తనగా మారిపోయింది. ఇపుడు నూత్నవేదకాలంలో ఈపాట క్రీస్తుకీ తిరుసభకీ వుండే ప్రేమబంధాన్ని సూచిస్తుంది. ఇంకా, భగవంతునికీ ప్రతి భక్తునికీవుండే సంబంధాన్నిగూడ తెలియజేస్తుంది. కనుక ఇప్పడు ఈ గీతాన్ని పలువిధాలుగా మన ప్రార్థనకు వాడుకోవచ్చు.

46. దేవుడే తన ప్రజలకు ఆశ్రయణీయుడు

ఇది సియోను గీతం. సియోను అంటే యెరూషలేం. ప్రభువు సియోనున వసిస్తున్నాడు కనుక శత్రువులు దాన్ని జయించలేరు. భూకంపం, ఉప్పెన మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా దాన్ని నాశం జేయలేవు. ప్రభువు ఆ నగరంలో శాంతిని నెలకొల్పుతాడు. సియోను నగరం తిరుసభకు చిహ్నం. సియోనును యావే ప్రభువులాగే తిరుసభను క్రీస్తు కాపాడి రక్షిస్తుంటాడు. దేవుడు మనకు ఆశ్రయణీయుడు. ఆపదల్లో మనలను ఆదుకొంటాడు. ఆ ప్రభువుని నమ్మితే చాలు మనం సురక్షితంగా వుండిపోతాం.

47. యిస్రాయేలు రాజు లోకనాయకుడునైన ప్రభువు

ఇది యావే రాజు అని చెప్పే కీర్తన. ప్రభువు విశ్వధాత్రికి రాజు. రాజులందరూ, జాతులన్నీ అతనికి లొంగి వుండవలసిందే. ఈ ప్రభువు వైభవంతో అభిషేకం పొందుతాడు.