పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులువుగా కర్మకాండ ఔతుంది. మన ఆరాధనంలో కూడ తరచుగా కర్మకాండలో పడిపోతాం. చిత్తశుద్ధి లోపిస్తుంది. ఈలాంటి సందర్భంలో మనం దేవునిఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తున్నామా అని పరిశీలించి చూచుకోవాలి. మన జీవితంలో ఎల్లప్పుడు దేవుని చిత్తప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుకొందాం.

41. రోగి ప్రార్ధనం

ఈ కీర్తన చెప్పిన భక్తుడు వ్యాధివాతబడ్డాడు. అతని స్నేహితులు అతన్ని విడనాడారు. విరోధులు అతన్ని ఎగతాళిచేసారు. ఇతనికి మాయదారి రోగంపట్టుకొంది. ఇక మంచంమీదినుండి లేవడు అని చెప్పుకొన్నారు. కాని ఈ పుణ్యపురుషుడు మాత్రం ప్రభువుని నమ్మి అతనికి మొరపెట్టుకొన్నాడు. అతని కృపవలన తన ఆపద తొలగిపోతుందని నమ్మాడు. ఈ విశుద్ధవర్తనునిలాగే మనంకూడ ఆపదల్లో ప్రభుని శరణువేడాలి.

42. ప్రవాసంలోని లేవీయుని ప్రార్ధనం

ఈ కీర్తన చెప్పిన భక్తుడు లేవీయుడు. అతడు దేవళానికి దూరంగా ఎక్కడో ప్రవాసంలో వున్నాడు. దేవళానికి వెళ్ళి దేవుణ్ణి దర్శింపలేకపోతినే అని బాధపడ్డాడు. దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీళ్ళకులాగె తన హృదయం ప్రభువు కొరకు తపించిపోతుందని చెప్పకొన్నాడు. ప్రభువు దివ్యముఖ్యాన్ని ఎప్పడు దర్శిస్తానోగదా అని ఉవ్విళూరి పోయాడు. పూర్వం అతడు భక్త బృందాన్ని దేవాలయానికి నడిపించుకొని పోయేవాడు. ఆ సంఘటన జ్ఞప్తికి వచ్చినపుడు అతని హృదయం ద్రవించిపోయింది. ఆ పుణ్యచరితుడు దేవాలయారాధనంలో భగవంతుణ్ణి బాగా అనుభవానికి తెచ్చుకొన్నవాడు. ఆతని భక్తి మనకుగూడ అలవడితే ఎంతబాగుంటుంది! అతనిలాగే మనంకూడ దేవళంలో ప్రభువుని ఎప్పుడెప్పుడు సందర్శిస్తామా అని ఉవ్విళ్ళూరిపోవాలి. ఆ ప్రభువు దయకు నోచుకోవడం మహాభాగ్యమని యెంచాలి.

48. ప్రవాసంలోని భక్తని ప్రార్ధనం

ఇది విలాప కీర్తనం. ఈ కీర్తనకారుడు దేవళానికి దూరంగా ఎక్కడో దిక్కులేని తావులో వున్నాడు. అక్కడ శత్రువులు అతన్ని పీడించారు. అతడు శీఘ్రమే దేవళానికి వెళ్ళి ప్రభువుని దర్శింపగోరాడు. దేవా! నీ వెలుగు నీ సత్యాన్నీ పంపు, అవి నన్ను నీ మందిరానికి తోడ్కొని వస్తాయి అని విన్నవించుకొన్నాడు. కీర్తనలు చెప్పిన భక్తులకు దేవాలయంపట్ల అపారమైన భక్తివుండేది. దేవాలయ భక్తి అంటే ప్రభు భక్తే. వాళ్లు ప్రభువు దివ్యముఖాన్ని దర్శించాలని తపించిపోయేవాళ్లు. నేడు వారి కీర్తనలు చదివి మనంకూడ దేవాలయ భక్తిని అలవర్చుకోవాలి. ప్రభువు సన్నిధిలోనికి వెళ్లాలని ఉబలాటపడాలి.