పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. దేవుని మహిమ, నరుని ఘనత

ఇది స్తుతిగీతం. దీన్ని వ్రాసిన భక్తుడు రాత్రిపూట ఆకాశం వైపు చూచాడు. అంతరిక్షంలోని నక్షత్రాలనూ చంద్రుడ్డీ దర్శించి పులకించిపోయాడు. ప్రభువు మాహాత్మ్యం ఆకాశం వరకు కీర్తింపబడుతూంది అని వాకొన్నాడు. ప్రకృతిలో దర్శనమిచ్చే ప్రభువుని స్తుతించాడు. అద్దంలో ప్రతిబింబంలాగ ప్రకృతిలో దేవునిరూపం కన్పిస్తుంది అనుకొన్నాడు. ఇంతలో అతనికి మరో ఆలోచన తట్టింది. దేవుడు చేసిన ప్రాణులన్నిటిలోను నరుడు గొప్పవాడు. అతడు దేవుడంతటివాడు, నేలమీది ప్రాణులన్నిటినీ ఏలేవాడు. దేవుడు విశ్వానికి అధిపతి. కాని అతడు తనకు బదులుగా నరుణ్ణి భూమిమీద అధిపతిగా నియమించాడు. నేడు మనం ఈ భూమిమీది ప్రతి ప్రాణిలోను, ప్రతివస్తువులోను దేవుణ్ణి చూడ్డం నేర్చుకోవాలి. విశేషంగా నరుళ్ళి అతని రూపాన్ని చూడాలి. “మా దేవుడవైన ప్రభూ! నీ మాహాత్యం ఈ ప్రపంచమంతటా కన్పిస్తుంది" అని అతన్ని పాగడాలి.

9. న్యాయాన్ని జరిగించే దేవునికి కృతజ్ఞత

ఇది కృతజ్ఞతా స్తుతులను తెలియజేసే కీర్తన. ఒక భక్తుని శత్రువులు పీడించారు. వ్యాధిబాధలు కూడ క్రుంగదీసాయి. అతడు దేవునికి మొరపెట్టగా ఆ ప్రభువు అతన్ని ఆర్తినుండి కాపాడాడు. అతడు దేవళానికి వచ్చి ప్రభువుకి వందనాలు అర్పించాడు.అతనికి దేవునిమీదగల నమ్మకం గొప్పది. దేవుడు అక్కరలో వున్న వారిని మరచిపోడు, పీడితుల ఆశలను వమ్ముజేయడు అని నమ్మాడు. అతనిలాగే మనం కూడ కష్టాల్లో వున్నపుడు ప్రభువుని నమ్మి అతనికి మొరపెట్టాలి. అతడు బాధార్తులను జ్ఞప్తికి తెచ్చుకొని వారి మొర వింటాడు అని నమ్మాలి.

10. ఆపదలో ప్రార్ధన

ఈ కీర్తన చెప్పిన భక్తునికి శత్రువులనుండి ఏదో ఆపద వాటిల్లింది. తన కష్టాల్లో ప్రభువు తనకు దూరంగా వున్నాడనిపించింది. ఐనా అతడు ప్రభువునందు విశ్వాసం కలవాడు. దేవుడు అనాధులనూ అభాగ్యులనూ తప్పక ఆదుకొంటాడు అనే నమ్మకం కలవాడు. కనుక ఆ ప్రభువుకి మనవి చేసి అతనినుండి సహాయం పొందాడు. జీవితంలో కష్టాలు వచ్చినపుడు మనకు కూడ దేవుడు దూరంగా వున్నాడు అన్పిస్తుంది. ఐనా మనం నిరాశపడకుండా దేవునికి విన్నపం జేయాలి. "ప్రభూ! నీవు మేలుకో!పీడితులను విస్మరించకు" అని ప్రార్ధనం జేయాలి.