పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ప్రభువు మనలను ప్రేమిస్తాడు. అతని దయవల్లనే మనకు అతనిమీద భక్తి పుడుతుంది. కనుక మనం అతన్ని స్తుతించి కీర్తించాలి. ఈ కీర్తనకారుల్లాగే మనంకూడ ఈ జీవితయాత్రలో ప్రభువు మనలను నడిపించాలని వేడుకొందాం. సకలాపదలనుండీ మనలను కాపాడాలని అడుగుకొందాం.

6. శ్రమల్లో ప్రార్ధన

ఈ పాట వ్యాధిగావున్న ఓ భక్తుని విలాపగీతం. అతడు తన పాపంవల్లనే దేవుడు తనకు ఈ రోగశిక్షను పెట్టాడని భావించాడు. దేవుడు తనమీద కోపించి తన్ను రోగంపాలుచేసి చీవాట్లు పెడుతున్నాడని అనుకొన్నాడు. ఐనా అతడు ప్రభువుని నమ్మి తన్ను మన్నింపమని కోరుకొన్నాడు. నేను చనిపోయి పాతాళలోకం చేరుకొంటే అక్కడ నిన్నెవ్వరు స్తుతిస్తారు? అందుచే నన్ను ఈ భూమిమీదనే బ్రతికి వుండనీయి. అప్పడు నిన్నుస్తుతించే భక్తుడు ఒక్కడయినా మిగిలివుంటాడు అని చెప్పకొన్నాడు. ఇది నిష్కల్మషమైన భక్తిభావం. అతడు తన వ్యాధిబాధలను భరించలేక ప్రభూ! ఈ వేదన ఎన్నాళ్ళ అని దీనంగా అరిచాడు. దేవుడు అతని వేడుకోలు విని అతని వ్యాధిని తొలగించాడు. కనుక అతడు దేవుడు నా రోదనాన్ని ఆలించాడని ఉత్సాహంగా చెప్పకొన్నాడు. దేవళానికి వచ్చి భక్తసమాజంముందు తన పూర్వచరిత్రను వెల్లడిచేసికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈలా పుట్టింది ఈ కీర్తన. ఈ రచయితలాగే మనంకూడ మన వేదనల్లో "నీవు శీఘమే విచ్చేసి నన్ను కాపాడు" అని దేవునికి మనవిచేసికోవాలి.

7. హింసితుని ప్రార్ధన

ఈ కీర్తన చెప్పిన భక్తునిమీద ఏవో అపదూరులు వచ్చాయి. దుషులు అతడు చేయని పాపాలను అతనికి అంటగట్టారు. కనుక అతడు బాధపడ్డాడు. ఐనా ప్రభువు నీతిమంతుడనీ దుష్టులను శిక్షిస్తాడనీ అతనికి బాగా తెలుసు. దేవుడు అన్యాయాన్ని ఓడించి సత్యాన్ని గెలిపిస్తాడని అతనికి నమ్మకముంది. కనుక దుర్మార్గుల అన్యాయమైన నిందలనుండి తన్నుకాపాడమని దేవుణ్ణి వేడుకొన్నాడు. న్యాయాధిపతియైన దేవుడు పాపలను శిక్షించాలనీ, వాళ్ళ తాము త్రవ్విన గోతిలో తామే కూలాలనీ కోరుకొన్నాడు. నేను నిజంగా పాపం చేసినట్లయితే నాకు పలానా శిక్షలు ప్రాప్తించునుగాక అని ఒట్టవేసికొన్నాడు. శత్రువుల నిందారోపణల నుండి ప్రభువు అతన్ని రక్షించాడనే అనుకోవాలి. జీవితంలో అప్పడప్పుడు మన మీదికి కూడ నిందలు వస్తాయి. మనం తప్పడు పనులు చేయకపోయినా చేసామని విరోధులు పుకార్లు పుట్టిస్తారు. ఆలాంటి సందర్భాల్లో మనంకూడ పై కీర్తనకారునిలాగే "ప్రభూ! నేను నిన్ను శరణువేడుతున్నాను. నన్ను వెన్నాడే శత్రువులనుండి నన్ను కాపాడు" అని ప్రార్ధించాలి.

225