పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. దైవ సేవ

అన్నా ఎల్కానా భార్య. ఆమె గొడ్రాలు. బిడ్డకోసం చాలకాలం ప్రభువుని ప్రార్ధించింది. నాకొక మగబిడ్డను ప్రసాదించావంటే వాడ్డి నీకే కానుకగా అర్పించుకొంటాను అని మొక్కుకొంది. ప్రభువు అన్నా మొర ఆలించి ఆమెకొక మగకందును ప్రసాదించాడు. ఆ బిడ్డను చూచి అన్నా మురిసిపోయింది. అతనికి సమూవేలు అని పేరు పెట్టుకొంది.

బిడ్డకు పాలు మాన్పించినంక అన్నా ఆ బాలుణిని తీసుకొని షిలో నగరంలోని దైవమందిరానికి వచ్చింది. ఒక కోడెదూడను తోలించుకొని, తూమెడు గోదుమ పిండితో, తిత్తెడు ద్రాక్షసారాయంతో పయనమై వచ్చింది. అవన్నీ దేవునికి కానుకలు. దూడను దేవునికి బలిగా అర్పించి కుమారున్ని యాజకుడైన యేలీవద్దకు తీసికొనిపోయింది. "అయ్యా! మునుప నేను బిడ్డకొరకు ప్రార్థిస్తే ప్రభువు వీనిని నాకు దయచేసాడు. కనుక ఈ పసికందును మరల ప్రభువుకే కానుక పెడుతున్నాను. ఈ బిడ్డడు జీవితాంతం ప్రభువుకే ఊడిగం చేస్తాడు" అని చెప్పింది. అన్నా భక్తిని మెచ్చుకొని ప్రభువు తరువాత ఆమె కింకా ఐదుగురు బిడ్డలను ఇచ్చాడు. సమూవేలు ఆ బాల్య ప్రాయంలోనే యాజకులు ధరించే నారబట్టలు తాల్చి దేవాలయంలో ప్రభువుకి సేవ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఇతడు మహాప్రవక్తా న్యాయాధిపతీ అయ్యాడు. తొలిరాజులైన సౌలునీ, దావీదునీ అభిషేకించింది గూడ ఇతడే -1 సమూ 1.

బైబులు తల్లలు తమ బిడ్డలను ఆదరంతో దైవ సేవకు అర్పించారు. ప్రభువు కూడ ఆ మహాతల్లలను దీవించాడు. ఆ యన్నాలాగే క్రైస్తవ తల్లిదండ్రులు గూడ తమ పిల్లలను భగవత్సేవకు అర్పిసూండాలి.