పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32. కుమాను భక్తులు

క్రీస్తునకు రెండువందల యేండ్లకు పూర్వమే యెస్పీను లనబడే యూదులు కొందరు యెరూషలేం దేవాలయ సమర్పణలను గర్షించి మృత సముద్రంతీరంలోని కుమ్రాను కొండల్లోనికి వెళ్ళి అక్కడ ఓ విధమైన మఠజీవితం జీవించడం ప్రారంభించారు. వీళ్ళ భావాల ప్రభావం నూత్నవేదంపై కొంతవరకు సోకింది. ఈ కుమ్రాను భక్తుల రచనల ప్రకారం నరుడు పుట్టుకతోనే రెండాత్మలను పొందుతాడు. ఒకటి సత్యాత్మ జ్యోతిరాత్మ న్యాయాత్మ మరొకటి అంధాత్మ పాపాత్మ జ్యోతిరాత్ములు వెలుగులో నడుస్తారు. అంధాత్ములు చీకటిలో నడుస్తారు. వీళ్ళ వినాశపుత్రులు, క్షయాత్మలు, నష్టప్రాణులు, పిశాచంచే నడిపింపబడే భ్రష్టజీవులు. ఈ కుమ్రాను శాఖకుచెందిన భక్తుడొకడు హోదయోత్ అనే గ్రంథంలోఈలా వ్రాసాడు, "ప్రభూ, నీ సహాయం లేందే మానవమాత్రుడైన నరుడు నీతిమంతుడు కాలేడని వింటున్నాం. కనుక నీవు నాలో వుంచిన ఆత్మద్వారానే నిన్ను మనవి చేస్తున్నాను. ఈ దాసులకు కలకాలం నీ కృపను అనుగ్రహిస్తూవుండు, నీ పరిశుద్ధాత్మద్వారా నన్ను శుద్ధిచేయి. " ఇవి పాపాన్ని గూర్చిన కుమ్రానుభక్తుల కొన్ని భావాలు.

33. రెండు నిబంధనల మధ్యకాలం

పూర్వ నూత్న వేదాల మధ్యకాలంలో గ్రీకు భాషలో నైతేనేం, అరమాయిక్ భాషలోనైతేనేం వందల కొలది గ్రంథాలు వెలువడ్డాయి, కాని యివేవీ భగవత్ర్పేరితాలు కాకపోవడం చేత బైబుల్లో చేరలేదు. ఐనా వీనిలోని భావాలు చాల వుదాత్తంగా వుండడంచేత బైబులు సిద్ధాంతాలను వివరించే వేదవిద్వాంసులు సంధియుగంలోని యీ గ్రంథాలనుకూడ అవలోకిస్తుంటారు. ఇక పాపాన్నిగూర్చి యీ గ్రంథాలు బోధించే భావాలను కొన్నిటిని పరిశీలిద్దాం. ఆదాము పాపంవలన జనసమూహం మృత్యువువాతబడుతూంది. అగ్ని వారిని కాల్చివేస్తుంది.

ఆదాము హృదయక్షేత్రంలో ఒ దుష్టబీజం నాటుకుంది. కోతకాలం వచ్చిందాకా ఈ బీజం పాపపు పండ్లను ఫలిస్తూనేవుంటుంది.

మనం చావును తెచ్చిపెట్టే దుష్కార్యం చేసినాక, యింక దేవుడు నరులకోసం వో అమృతయుగాన్ని కలిగించివుంటే మాత్రం దానివలన లాభమేమిటి?

మనలో వో దుష్టహృదయం బలపడిపోయింది. దానివల్ల మనకు లయమూ, క్షయమూ, వినాశమూ, మృత్యువూ సిద్ధించాయి.

పాపఫలితాన్ని వర్ణించే యీ వాక్యాలన్నీ చక్కగా మననం చేసుకోదగ్గవిగదా!