పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్లు చెప్పినపనులు చేసికొంటూ పోతూండగా అతని జ్ఞానం ఏలా వృద్ధి చెందింది? అతనికి ఎవరు బోధించారు? యోహాను 7, 15 ప్రకారం యేసు బోధిస్తుండగా చూచిన యూదులు ముక్కుమిూద వ్రేళ్లు వేసికొని "విద్యాశిక్షణ లేని యీతనికి యింత జ్ఞానం ఏలా అలవడింది? అని విస్తుపోయారట. మరి ఏరబ్బయి బోధించకుండానే క్రీస్తు అంత మతపరిజ్ఞానం ఏలా సంపాదించాడు? మరియు మాతే క్రీస్తు బాలునికి పూర్వవేదం బోధించి వుంటుంది. ఆ బాలునికి గ్రంథంపట్ల అపారమైన భక్తిని కలిగించి వుంటుంది. బాల్యంలోనే అతడు దేవాలయంలోని వేదశాస్తుల బోధలను శ్రద్ధగా విన్నాడు. ఆ గ్రంథంలోని ఆయా అంశాలను గూర్చి వాళ్లను ప్రశ్నలు కూడ అడిగాడు - లూకా 2,46. రుజువు చేయడానికి మనకు ఖచ్చితమైన ఆధారమేమి లభించదు గాని, ఈ బైబులు జ్ఞానమంతా అతనికి మరియమాత వల్లనే సిద్ధించి వుంటుంది. బైబులు తల్లలు తమ పిల్లలకు వేదసత్యాలు నేర్చినతీరు అలాంటిది.

చెప్పవచ్చిందేమిటంటే, మన పిల్లలకు మతవిద్య తల్లిదండ్రులే ప్రారంభించాలి. ఆ విద్య కూడ బైబులు గ్రంథంతోనే ఆరంభం కావాలి. మన యిల్లే పిల్లలకు మొదటి పాఠశాల కావాలి. బిడ్డకు భగవంతుణ్ణి గురించి బోధించే మొదటి గురువుల తల్లిదండ్రులే కావాలి. మొదట ఇంటి వద్ద తల్లిదండ్రుల నుండి భక్తిని అలవర్చుకోని పిల్లలు, తర్వాత బట్లో ఉపాధ్యాయులు చెప్పే మతసత్యాలను అంతగా నేర్చుకోలేరు.

ఇంకా మన కుటుంబాల్లో తప్పకుండా బైబులు గ్రంథం వుండాలి. స్వరూపాలను లాగే దాన్ని కూడ ఇంటిలో ప్రముఖమైన తావులో వుంచాలి. మనం స్వరూపాలకు చూపే భక్తినే దానికి గూడ చూపుతూండాలి. బాల్యప్రాయం నుండే మన పిల్లలకు ఆ పుస్తకం పట్ల గౌరవభావం ఏర్పడాలి. చిన్ననాటి నుండే పిల్లలకు బైబులు చదివి విన్పిస్తూండాలి. దానిలోని కొన్ని వాక్యాలు వాళ్ల చేత కంఠస్థం చేయించాలి. మొదటి సత్రసాదం తీసికొనేప్పడే మన పిల్లలకు ఓ సొంత బైబులు కూడ కొనిపెట్టాలి. ఈ కృషంతా ఇంటిలో అమ్మా నాన్నే చేయాలి.

ఇండియాకు మొదటి కార్డినలు ఐన వలేరియన్ గ్రేష్యస్ గారు సెప్టంబరులో చనిపోయారు. వీరికి బాల్యప్రాయంలోనే తండ్రి గతించాడు. కాని వీరి తల్లి క్యారోలెట్ చాలా భక్తిమంతురాలు. ఆమె ఆ బిడ్డకు చిన్నతనంలోనే మతసత్యాలు నేర్పించి భక్తి పుట్టించింది. గ్రేష్యస్ గారు తన్ను గూర్చి చెప్పకొన్నపుడల్లా తన ఉన్నతికి తల్లే కారణమని ఆమెను చాల ప్రశంసిస్తూండేవాళ్లు. ఈలాంటి తల్లులు తండ్రులూ పుష్కలంగా వుంటే మన పిల్లలు గురువులూ మఠకన్యలూ ఎందుకు కారు?

221