పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసలు బిడ్డలు లేకపోయినా బాధే. బిడ్డలు అమితంగా వున్నా వాళ్ళను పోషించలేకా బాధే పిల్లలు నిప్రయోజకులైనా బాధే. ఈలాంటి కుటుంబపు గొడవలతో సతమతమై పోయేపుడు పై పుణ్యదంపతులు జెకరియా యెలిసబేత్తులు గుర్తుకి వస్తారు. ఈ యిద్దరు భగవంతుడు మన సేవలు అందుకోవడానికి యోగ్యుడని గుర్తించి అనన్యచిత్తంతో అతన్ని కొలిచారు. ఆ ప్రభువు మనకేవో బహుమతులు ఇస్తాడన్నపేరాసతో గాదు. అతనికోసమే అతన్ని సేవించారు. కాని తరచుగా మన భక్తిలో కొండంత స్వార్థం నిండివుంటుంది. మనం దేవుని వద్దనుండి అవీయివీ కోరతాం. మన కోరికలు తీరకపోతే అతన్ని విడనాడతాం. దూషిస్తాం గూడ. "మ్రూక్కిన వరమీయని వేల్పుని గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!" అన్నాడు ఓ తెలుగు కవి. ఈ మనస్తత్వం మనందరిలోను వుంటుంది. కాని ఇది పద్ధతి కాదు. నిస్వార్ధ బుద్ధితో ఆ ప్రభువుకి ఊడిగం చేసేవాళ్ళని అతడు కరుణిస్తాడు. అలాంటివాళ్ళను అతడు పై జకరియా యెలిసబేత్తులను లాగ తలవని తలంపుగా దీవించి ఆశ్చర్యచకితులను చేస్తాడు.

9. ప్రార్ధనం

రఫాయేలుతో ప్రయాణం కట్టిన తోబియా ఎక్బటానా నగరంలో తన బంధువైన "రగూవేలు కూతురు సారాను పెండ్లి చేసికొన్నాడు. కాని ఓ పిశాచం సారాను పూని వుండేది. అంతకుముందే ఆమెను ఏడ్గురు వరులు పెండ్లియాడారు. వాళ్ళందరినీ ఆ దయ్యం చంపివేసింది. కనుక తోబియాకు కూడా అదే గతి పడుతుందేమోనని సారా బంధువులు బయపడ్డారు. పెండ్లి నాటి రేయి తోబియా సారా గదిలోకి వెళ్ళాడు. అతడక్కడ ఏమిచేయాలో రఫాయేలు ముందుగానే ఉపదేశమిచ్చాడు. అతని సలహా ప్రకారం తోబియా తాను పట్టిన చేప గుండెను కాల్చి పొగవేసాడు. ఆ పొగకు పిశాచం పారిపోయింది. అటుపిమ్మట తోబియా సారాను తన దగ్గరకి పిలిచి ఈలా ప్రార్థన చేసాడు: "ప్రభో! నీవు భూమ్యాకాశాలను సృజించావు. నీవు ఆదామును సృజించి అతనికి తోడుగా ఏవను ప్రసాదించావు. ఆ దంపతుల నుండే మానవ జాతి ఉద్భవించింది. ప్రభో! నీవు నరుడు ఒంటరిగా ఉండడం మంచిదికాదు అతనికి సాటియైన సహాయకురాలిని చేయాలి అని అనునకొన్నావు. కనుక నేడు నేను కామతృప్తి కోసం గాక చిత్తశుద్ధితో ఈమెను భార్యగా స్వీకరిస్తున్నాను. ఈమెనూ నన్నూకరుణించు. ముసలి ప్రాయం వరకు మేమిద్దరం కలసి జీవించేలా చేయి." ఆ ప్రార్ధనాంతంలో సారా ఆమెన్ అని జవాబు చెప్పింది. ఆ పిమ్మట తోబియా సారాను కూడాడు. ఆ దంపతులకు పిశాచ పీడ సోకలేదు. మరునాడు సజీవుడై యున్న తోబియాను చూచి సారా తల్లిదండ్రులు విస్తుపోయారు. దేవునికి వందనాలు అర్పించారు - తోబీతు 8.