పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుణ్ణి క్షమించడు. కావుననే ఈ మార్పును అనుగ్రహించమని 51వ కీర్తనను వ్రాసిన భక్తుడు ప్రార్ధించాడు. అతడు ఈ మార్పును సూచిస్తూ మూడు ఉత్ప్రేక్షలు వాడాడు. అవి "కడుగు" "శుద్ధిచేయి" “సృజించు" అనే క్రియలు.

"నా దోషాలు పోయేలా నన్ను బాగా కడుగు" అని ప్రార్థించాడు - 51.2 ఇక్కడ, చాకలిబట్టలు ఉతికి వాటిని శుభ్రంగాను, తెల్లగాను తయారుచేసినట్లే నన్నూ శుభ్రం చేయమని భావం.

"నా పాపాలు పోయేలా నన్ను శుద్ధిచేయి" అని వేడుకున్నాడు - 51,2. ఇక్కడ, యాజకుడు కుష్టరోగిని శుద్ధిచేసినట్లే నన్నూ శుద్ధిచేయమని భావం,

"నా యందు నిర్మల హృదయాన్ని సృజించు" అని మనవిచేసాడు - 51, 10. ఇక్కడ “సృజించు" అనే క్రియ ప్రధానమైంది. "దేవుడు మొట్టమొదట భూమ్యాకాశాలను సృజించాడు" అనే ఆదివేదవాక్యంలోకూడా ఇదే క్రియ వాడబడింది. (హీబ్రూ భాషలో "బారా"). బైబుల్లో ఈ క్రియ ఏక్కడవాడబడినా దాని కర్త సర్వత్ర భగవంతుడే. కనుక పాపపరిహారమనేది భగవంతుని సృష్టిగాని నరునిపని కాదు. ఈ పాపపరిహారం భగవంతుని సృష్టికార్యాలన్నిటి లోను మహోదాత్తమైంది. మహా విచిత్రమైంది కూడ. పాపాన్నిగూర్చి పూర్వవేదం బోధించే భావాలన్నీయిూ 51వ కీర్తనలో దట్టంగా కరుడుగట్టుకొని వున్నాయి. ఈ కీర్తనను నిదానంగా అవధానంగా చదువుకుంటే బైబులు రచయితలు చిత్రించిన పాపం ఎలాంటిదో కొంతవరకైనా బోధపడుతుంది.

31. నీ పరిశుద్ధాత్మను నా యెద్ద నుండి తీసివేయకు - 51.11

దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారనీ పరిశుద్దాత్మకూడ ఓ దైవవ్యక్తియనీ మనకు తెలిసినట్లుగా పూర్వవేద ప్రజలకు తెలియదు. ఐనా పూర్వవేద రచయితలు చాల తావుల్లో దేవుని యాత్మను గూర్చి మాటలాడారు. వాళ్ళ దృష్టిలో దేవుని యాత్మ యనగా దేవుని శక్తి. ఈ శక్తినే నూత్న వేదం ఓ వ్యక్తిగా, పరిశుద్దాత్మగా పేర్కొంటుంది.

దేవుని యాత్మ పాపపరిహారం కలిగిస్తుందని ప్రవక్తల బోధ, యావే ఆత్మజ్ఞానాన్నీ వివేకాన్నీ కలిగిస్తుందంటాడు యెషయా - 11,2. "వారి హృదయంమీద నా ధర్మవిధులను వ్రాస్తాను, వారి దోషాలను క్షమిస్తాను" అంటాడు ప్రభువు యిర్మీయా ప్రవచనంలో - 31, 33-84. ఈ ధర్మవిధులనే యెహెజ్కేలు ప్రవక్త దేవుని ఆత్మ అని పిలుస్తాడు. "నా యాత్మను నీయందుంచుతాను. నా విధులను అనుసరించేవాళ్ళనుగా మిమ్మ తీర్చి దిద్దుతాను. మీ యపవిత్రతను పోగొట్టి మిమ్మ రక్షిస్తాను" అంటాడు యెహెజ్కేలు ప్రవచనంలో ప్రభువు - 36,27-29. ఇలా ఆత్మ పాపపరిహారాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే యోహాను సువార్తలో కూడ "మీరు పరిశుద్దాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి క్షమాపణం లభిస్తుంది అని చెప్పబడింది. 20, 22-23.