పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. గోదుమగింజ

“గోదుమగింజ భూమిలోపడి నశించనంతకాలం ఒంటిగానే వుంటుంది. నశించినంక విస్తారంగా ఫలిస్తుంది" - యోహా 12, 24. గోదుమగింజ నేలలోపడి చివికిపోనంతకాలం ఎండిపోయి ఓ రాతిముక్కలా వుంటుంది. దానిలో ప్రాణమున్నట్లే కన్పించదు. కాని ఓమారు భూమిలోపడి చివికిపోయినంక అది మొలకెత్తినూరంతలుగా ఫలిస్తుంది. ఒక గింజకుమారుగా నూరు గింజలౌతుంది. ఆలాగే మనంకూడ మన పాపజీవితానికి చనిపోవాలి. మనలోని స్వార్థం చివికిపోవాలి. మనలోని తొలిరూపం నశించి క్రీస్తురూపం ఏర్పడాలి. అప్పుడు మనలో క్రొత్తజీవం నెలకొంటుంది. మనమూ నూరంతలుగా ఫలిస్తాం, విశ్వాసుల హృదయాల్లో వరప్రసాదం పెంపొందిస్తాం. ఇక్కడ స్వార్ణానికి చనిపోవడమే మన నిగ్రహం అనుకోవాలి.

2.ద్రాక్షతీగ

“ఫలించే ప్రతికొమ్మా మరీ యొక్కువగా ఫలించేందుకై నా తండ్రి దానిని కత్తిరించివేస్తాడు" - యోహా 15,2. ద్రాక్ష కొమ్మలను కత్తిరించివేస్తారు. ఈలా కత్తిరించడం ద్వారా ఆ కొమ్మలు ఏపుగా గుబురుగాపెరిగి గుత్తులుగుత్తులుగా కాయలు కాస్తాయి. ఈలా కత్తిరింపవేయకపోతే కొమ్మ మొద్దుబారిపోతుంది. సరిగా కాపకాయదు. ఈలాగే మనలోని పనికిమాలిన గుణాలు కూడ కత్తిరింపుపడాలి. స్వార్థం సమసిపోవాలి. అప్పడుగాని మనం దివ్యగుణాలతో నిండిపోం, విశ్వాసులకు మేలుచేయలేం. కొమ్మ విలువంతాగూడ తల్లితీగతో ఐక్యం గావడంలోనేవుంది. అది తల్లితీగలోని సారాన్నే కాయలుగా మార్చుకోవాలి. మన గొప్పంతాగూడ క్రీస్తుతో ఐక్యంగావడంలోనే వుంది. మనం అతని సారాన్ని అనగా అతని వరప్రసాదాన్ని సత్కార్యాలుగా మార్చుకోవాలి, ఇక్కడ స్వార్ణానికి కత్తిరింపబడ్డమే మన నిగ్రహం అనుకోవాలి.

3. ప్రసవించే తల్లి

"ప్రసవకాలం వచ్చినపుడు స్త్రీ బాధపడుతుంది. కాని బిడ్డ పుట్టగానే శిశువును కన్నానుగదా అని తన బాధకాస్త మరచిపోతుంది" - యోహా 16,21. స్త్రీకి ప్రసవవేదనం తప్పదు. కాని ఆవేదనే తర్వాత సంతోషంగా మారిపోతుంది. ఆమె ప్రసవవేదన అనుభవించకపోతే గొడ్రాలుగానే వుండిపోతుంది. మనంకూడ స్వార్ణానికి చచ్చిపోయేపుడు బాధగానే వుంటుంది. కాని ఈబాధే తర్వాత సంతోషంగా మారిపోతుంది. ఈ బాధ ననుభవింపకపోతే మనంకూడ గొడ్రాలైన స్త్రీలాగే నిప్రయోజకులమై పోతాం. ఇక్కడ వేదనలు అనుభవించడమే మన నిగ్రహం అనుకోవాలి.