పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ప్రార్థనాభావాలు

1. అన్యదేశాలనుండి మనదేశానికివచ్చి మన ప్రజలకు సేవలు చేసే విదేశగురువులనూ మఠకన్యలనూ చూస్తూంటే మనకు సిగ్గువేస్తుంది. వాళ్లకుండే ఆసక్తీ స్వార్థత్యాగమూ మనకు లేదు. వాళ్లలాగా మనం కష్టపడి పనిచేయం. వాళ్లలాగా తోడిజనంకోసం మన జీవితాన్ని సమర్పించుకోం, అందుకే వాళ్లలాగా మనం క్రీస్తుని బోధించలేకపోతున్నాం. ఈ విదేశ ప్రేషితులనుజూచి మన జీవితాన్ని సవరించుకోవడం మేలు.

2. జేన్ షాంతాల్ ధనవంతురాలు, భక్తురాలుకూడ ఆమె భర్త మరణానంతరం మఠకన్యకావాలనుకొంది. కాని ఆమె యిల్ల విడిచిపోయేనాడు ఆమె బిడ్డలు గడపదగ్గిర అడ్డంగా పండుకొన్నారు. మమ్మందరిని ఏ నట్టేటిలో గలిపి పోతావని ఏడ్చారు. కాని ఆమె ధైర్యంతో వాళ్లమీదిగా నడిచి కాన్వెంటుకు వెళ్లిపోయింది. తరువాత విజిటేషన్ మఠసభను స్థాపించింది. పునీత పట్టంగూడ పొందింది. గొప్ప ప్రేషితుల కార్యదీక్ష అలా వుంటుంది.

3. ఈనాడు ఒక్క మదర్ తెరేసా ఎంతసేవ చేసింది! ఆనాడు ఒక్క ఫ్రాన్సిస్ జేవియర్ ఎంతకృషి చేసాడు! భక్తీ ఆసక్తిగల ప్రేషితులుంటే ఎంత పనైనా జరుగుతుందిగదా! ఆసక్తిలేని గురువులూ మఠకన్యలూ మేలుకుమారుగా కీడుచేస్తారు.

4. ప్రేషితులకు ఉదారగుణంలో ప్రజలకు సేవలుచేయాలన్న కోరిక చాల ముఖ్యం. ఇగ్నేప్యసు ఈ యూదార్యంకోసం ఈలా ప్రార్థించాడు:

"ప్రభో!

గాయాలను లెక్కించకుండా పోరాడేలాగా
విశ్రాంతిని కోరుకోకుండా పరిశ్రమ చేసేలాగా
బహుమతిని ఆశించకుండా కృషిచేసేలాగా
నీ సేవలో నాకు ఔదార్యాన్ని ప్రసాదించు".

7. నిగ్రహం

ప్రేషితులు ఇతరులకు దివ్యజీవాన్ని ప్రసాదించేవాళ్లు. కాని మనం మొదట దివ్యజీవితం జీవించందే వేరేవాళ్లు ఆలాంటి జీవితం జీవించేలా చేయలేం. ఇక, మనం దివ్యజీవితం జీవించాలంటే నిగ్రహం అవసరం. ఈ యధ్యాయంలో నిగ్రహాన్ని గూర్చి కొన్ని సంగతులు తెలిసికొందాం.