పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. అందరికీ అనుకూలంగా మెలగాలి

తోడిజనాన్ని సేవించినపుడు ప్రభువునే సేవించినట్ల, కాని తోడిజనంపట్ల అనుకూలంగా మెలగలకపోతే వాళ్లకు సేవచేయలేం. కావుననే పౌలు అందరికీ దాసుడయ్యాడు. అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తే కొందరినైనా రక్షించవచ్చుగదా అనుకొన్నాడు. అతడు యూదులతో మెలిగేప్పడు యూదుల్లాగ, గ్రీకు రోమను ప్రజలతో మెలిగేప్పడు వాళ్లలాగ నడుచుకొన్నాడు - 1కొ 9, 19-21. పౌలు పేర్కొన్న ఈ యనుకూలగుణం ప్రేషితులకు అత్యవసరం. ప్రజలకు అనుకూలంగా మెలగకపోతే వాళ్లు మనబోధ ఆలించరు. ఇది తెలియక కొంతమంది ప్రేషితులు తమ పద్ధతులూ తమ పోకడలే ముఖ్యమన్నట్లు మెలుగుతూంటారు. మొండిపట్టు పడుతూంటారు.

6. తల్లిదండ్రులు పిల్లలకోసం

పిల్లలు తల్లిదండ్రులకోసం సొమ్ము చేకూర్చరు. తల్లిదండ్రులే పిల్లలకోసం ఆస్తి చేకూర్చిపెడతారు. కనుక పౌలు తన బిడ్డలైన కొరింతు విశ్వాసులకొరకు భగవంతుని ఆస్తి చేకూర్చి పెట్టాడు. తాను సంపాదించిన దివ్యసంపదలను ఆ యాత్మలకోసం వ్యయం చేసాడు -2 కొ12, 14-15, తన్నుతాను వాళ్లకోసం అర్పించుకొన్నాడు. ఈ పౌలులాగే మనంకూడ విశ్వాసులకొరకు జీవించాలి. మనశక్తి సామర్ష్యాలను వాళ్లకోసం వినియోగించాలి. మనకున్నదికాస్త వాళ్లపరం చేయాలి. అంతేగాని, ఆ విశ్వాసుల సొత్తునే మనం అపహరించగూడదు.

7. ఆదర్శం

ప్రేషితులకు స్వార్థం పనికిరాదు. పరార్థబుద్ధి కావాలి. అనగా విశ్వాసులు మనకేదో ఉపకారంచేయాలి అని కోరుకోగూడదు. మనమే ఆ విశ్వాసులకు ఏదో ఉపకారంచేయాలి అనుకోవాలి. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపెట్టుకోలేదు - రోమా 15, 3. ఇది మహావాక్యం. అతడు తన సుఖాన్ని తాను వెదుకుకున్నట్లయితే మనకోసం సిలువమీద చనిపోయేవాడేనా? ఇక, పౌలుకూడ క్రీస్తులాగే స్యార్థరహితంగా జీవించడానికి ప్రయాసపడ్డాడు. తాను క్రీస్తుని అనుసరించినట్లే తన విశ్వాసులూ తన్ననుసరించాలని కోరుకొన్నాడు - ఫిలి 3, 17. ఈ యనుసరణం దేనిలో? స్వార్గాన్ని చంపుకోవడంలోనే కనుక ప్రభువులాగా, ప్రభువుశిష్యుడు పౌలులాగా, మనంకూడ స్వార్థరహితమైన జీవితం గడపాలి. అప్పడేగాని పదిమందికి సేవలుచేసినవాళ్లం కాలేం. పేషితకార్యం ఓ బాధ్యత, ఓ ఋణం. భక్తులైన ప్రేషితులు ఈ ఋణం ఏలా తీర్చుకోగలమా అని భయపడిపోయి అహోరాత్రులూ కృషిచేస్తూంటారు. అల్పులైన ప్రేషితులు మాత్రం నిశ్చింతగా కాలం గడుపుతూంటారు.