పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. డమస్కులోని అననీయ అనే భక్తుడు సౌలుకు జ్ఞానస్నానమీయాలి. ప్రభువు అననీయతో "క్రైస్తవేతరులకు, రాజులకు, యిస్రాయేలుప్రజలకు నన్నుగూర్చి బోధించడానికై నేను ఈ సౌలుని ఎన్నుకొన్నాను. సౌలు నా నిమిత్తం ఎన్నిబాధలనుభవించాలో నేనతినికి తెలియజేస్తాను" అని చెప్పాడు - అచ 9, 15-16, ప్రేషితులంగా మెలగడమంటే యీ సౌలులాగా నానా ప్రజలకు క్రీస్తుని బోధించడం. క్రీస్తుసేవలో నానాయాతనలూ అనుభవించడం. దీనికి దగిన సామర్థ్యాన్నీ శక్తినీ ప్రసాదించేది గూడ ఆప్రభువే.

4.యీర్మియా ప్రభునిగూర్చి బోధిస్తూండగా ఆనాటి రాజులూ అధికారులూ అతనికి అడ్డదగిలారు. అతన్ని హింసించారు. ఆ బాధ భరించలేక యిర్మీయా ఇక దేవుణ్ణిగూర్చి బోధించడం మానివేద్దామనుకొన్నాడు.కాని దేవుణ్ణిగూర్చి బోధించాలి అనే కోరిక అతని హృదయంలోను ఎముకల్లోను అగ్నిజ్వాలలాగ మండజోచ్చింది. ఉదరంలోమండే ఆ నిప్పను అతడు భరించలేక పోయాడు. దాన్ని వెళ్లగక్కితేనేగాని - అనగా దైవవార్తను బోధిస్తేనేగాని - అతనికి ఉపశాంతి కలుగలేదు. ప్రభువు ప్రేషితులను నిర్బంధపెట్టేతీరు ఈలా వుంటుంది - యిర్మీ20,9.

5. తూర్పుదేశపు జ్ఞానులువచ్చి క్రీస్తు శిశువునూ ఆ శిశువు చెంతనున్న మరియమాతనూ దర్శించారు - మత్త2, 11. సువిశేషం చెప్పదుగాని, ఆ తల్లి జ్ఞానులకు శిశువును అందించి వుంటుంది. వాళ్లు ఆ బిడ్డను ముద్దాడి ఆరాధించి కానుకలర్పించు కొన్నారు. అప్పటినుండి క్రైస్తవసమాజంలో మరియ చేసేపని విశ్వాసులకు క్రీస్తుని అందిస్తూండడమే. ఆమె మహాప్రేషితురాలు. ఈ మరియలాగే గురువులూ మఠకన్యలూ ప్రజలకు క్రీస్తుని అందిస్తూండాలి. ప్రేషితధర్మమంటే యిదే.

6. ఆత్మరక్షణ కాంక్ష

ప్రేషితులు క్రీస్తుని బోధించాలనీ క్రీస్తు రక్షణాన్ని ప్రజలకు అందజేయాలనీ ఉవ్విళూరుతూండాలి. ప్రస్తుతాధ్యాయంలో ఈ యాత్మరక్షణ కాంక్షనుగూర్చి కొన్ని అంశాలు పరిశీలిద్దాం.

1. అధికంగా పొందినవాళ్లు

ప్రభువు ఎప్పుడుగూడ అధికంగా పొందినవాళ్లనుండి అధికంగానే అడుగుతాడు - లూకా 12,48. పేషితులుగూడ ప్రభువునుండి ఎక్కువగానే పొందుతారు. వాళ్లపిలుపు అనేది దేవుడిచ్చిన ఓ మహాభాగ్యం, కనుక వాళ్లు ఈ పిలుపునకు తగిన విధంగా లెక్కనొప్పజెప్పాలి. దేవుడు మనకిచ్చిన భాగ్యాలను మనం ఇతరులకు పంచిపెడుతూండాలి. పౌలు రెండవ ప్రేషిత ప్రయాణలో త్రోయ అనే నగరానికి వచ్చాడు. అక్కడ ఓరాత్రి