పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోహా 15,4. కొమ్మలు తల్లితీగలోనికి అతుకుకొని వుంటాయి. ఆతల్లితీగలోని సారాన్నిపొంది దాన్ని కాయలుగా మార్చుకొంటాయి. ఆలాగే శిష్యులుకూడ క్రీస్తులోనికి ఐక్యమైయుండాలి. అతని సారాన్ని లేక వరప్రసాదాన్నిపొంది దాన్ని ఫలాలుగా మార్చుకోవాలి. శిష్యులు తాము ఫలించడమంటే విశ్వాసులహృదయాల్లో వరప్రసాదం నెలకొనేలా చేయడమే. విశ్వాసులకు వరప్రసాదం అందీయడమే.

3. ప్రసవవేదన అనుభవించే తల్లి

"నా బిడ్డలారా! క్రీస్తురూపం మీలో నెలకొనేదాకా మిమ్మగూర్చి నేను ప్రసవేదన పడుతూన్నాను" - గల 4,19. తల్లి గర్భవతియై ప్రసవవేదన అనుభవించి బిడ్డను కంటుంది. పౌలు ఇక్కడ తన్ను ఓ గర్భవతితో పోల్చుకొన్నాడు. తాను కనేది క్రీస్తుబిడ్డనే. అతడు ఆశిశువును కనేడెక్కడ? విశ్వాసుల హృదయాల్లోనే. అనగా విశ్వాసుల హృదయాల్లో క్రీస్తు నెలకొనేలా చేయాలని పౌలు నానాయాతనా పడుతూన్నాడు. ఈ పౌలులాగ ప్రేషితులందరుగూడ శ్రమననుభవించి విశ్వాసుల హృదయాల్లో క్రీస్తుని పుట్టించాలి. అనగా విశ్వాసులు క్రీస్తుని పొందేలా చేయాలి.

పంటపొలం, ద్రాక్షతీ, బిడ్డనుకనే తల్లి - ఈమూడు ఉపమానాలు గూడ ప్రేషితులు విశ్వాసులహృదయాల్లో క్రీస్తుజీవం నెలకొల్పాలని సూచిస్తాయి. ప్రభువు మననుండి ఆశించేది యిదే, క్రీస్తుని ప్రకటించడమన్నాగూడ యిదే.

4 ప్రార్థనాభావాలు

1. "నా తండ్రి నన్నుపంపినట్లే నేనూ మిమ్మ పంపుతూన్నాను" అన్నాడు క్రీస్తు - యోహా 20,21. క్రీస్తు పిత పంపగా వచ్చాడు. మొదటి ప్రేషితుడు అతడే. ఈ క్రీస్తు మల్లా తనతరపున మనలను పంపుతాడు. మనం అతనికి అనుయాయులమై అతని పేషితకార్యాన్ని కొనసాగిస్తాం. కనుక మనం ప్రప్రథమంగా పంపబడినవాళ్లం. మనంజీవించే గురుజీవితమూ కన్యాజీవితమూ ఈ లక్షణానికి అనుకూలంగా వుండాలి.

2 యెషయాప్రవక్త ఓ దర్శనంలో ప్రభుని చూచాడు. ప్రభువు రాజఠీవితో దేవాలయంలో సింహాసనంపై ఆసీనుడైయున్నాడు. దేవదూతలు కొలువకాల్లె అతనిచుటూ మూగివున్నారు. ప్రభువు ఈ కొలువుకాళ్ళతో సంప్రతిస్తూ "మనతరపున దూతగా బోయేదెవరు? యెరూషలేము ప్రజలకు బోధించేదెవరు?" అని ప్రశ్నిస్తూండడం యెషయా విన్నాడు. అతడు వెంటనే ముందుకి వచ్చి "ప్రభో! నేనున్నానుగదా! నన్ను పంపు. నీ తరపున నేను వెళ్లి ప్రజలకు బోధిస్తాను" అన్నాడు - యెష6,9. ఈ ప్రవక్తలాగే ప్రేషితులు క్రీస్తుని బోధించడానికి ఉత్సాహంతో ముందుకిరావాలి. ప్రేషితనాయకత్వమంటే యిదే. ఈ నాయకత్వంలేని ప్రేషితులు జీవితంలో పెద్దగా యేమీ సాధించలేరు.