పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. బాధల్లోగూడ

శిష్యులు క్రీస్తు పాటల సమయంలో అతన్ని వదలివేసారు. ఇది వాళ్లబలహీనత "నేను కాపరిని వధిస్తాను, మందంతా చెల్లాచెదరౌతుంది" అన్నప్రవక్త వాక్యాలు నెరవేరాయి - మత్త 26,31. ఐనా శిష్యులు మల్లా యెరూషలేముమీదిగదిలో సమావేశమై ప్రభుని స్మరించుకోవడం మొదలెట్టారు. ఈవిధంగా "ప్రభువుతో వుండిపోవడం" అపోస్తలుల తర్ఫీదులోని ముఖ్య విషయం. వాళ్లల్లో కొన్నిలోపాలు ఉండవచ్చుగాక. ఉదాహరణకు, ఓమారు శిష్యులంతా నేనుగొప్పంటే నేనుగొప్పని తమలో తాము గీజులాడుకొన్నారు - మార్కు 9, 33-35. కాని ప్రభువు ఈలాంటి బలహీనతలను అట్టే పట్టించుకోలేదు. పైగా అతడు “మీరు నాబాధల్లో నాకు తోడుగా నిలబడ్డాడు" అని వాళ్లను భూషించాడుగూడ - లూకా 22,28, ఈలాగే మనంకూడ కష్టసుఖాల్లోను ప్రభువుచెంత నిలవగలిగి వుండాలి. తర్ఫీదు అంటే యిదే.

5. క్రీస్తే మనకు ఆదర్శం

క్రీస్తు ఎప్పడూ తనతండ్రితో వుండేవాడు. శ్రమల్లో కూడ అతడు తండ్రియిచ్చిన పాత్రను త్రాగడమే తనవిధి అనుకొన్నాడు - మార్కు 14,36. తండ్రియిచ్చిన కార్యక్రమం ప్రకారం సిలువమీద చనిపోవడమే తన బాధ్యత అనుకొన్నాడు. ఈలాంటి క్రీస్తుని ఆదర్శంగా బెట్టుకొని మనంగూడ నిత్యం అతనితో వుండిపోవడం నేర్చుకోవాలి. సెమినరీ, నోవిష్యేటు ఇందుకొరకే ఉద్దేశింపబడ్డాయి. ఆనాడు అపోస్తలులకుమల్లె ఈ నాడు మనకుగూడ క్రీస్తే ఇక్కడ తర్ఫీదునిస్తాడు. అపోస్తలుల జీవితంలో ఆ మూడేండల్లా ఏలాంటివో మనజీవితంలో ఈ తర్ఫీదు యేండ్లు ఆలాంటివి. ఇక్కడ ప్రభువుతో అన్యోన్యంగా మెలుగుతూ జపమూ బైబులుపఠనమూ నేర్చుకోవాలి. ప్రేషితోద్యమాన్ని అవగాహనం చేసికోవాలి. తోడినరులకు సేవచేయడానికీ సువార్తను ప్రకటించడానికీ సంసిద్ధంకావాలి.

6. ప్రార్థనాభావాలు

1. మరజీవితంలో ప్రవేశించే అమ్మాయికి ముఖ్యమైంది అద్భుతమైన తెలివితేటలూగాదు, పెద్ద చదువులూగాదు, ఆరోగ్యమూగాదు. కాన్వెంటికి ఎంతకట్నం ఈయగలమా అనేది అసలేగాదు. మరి ఆయమ్మాయి భగవంతుణ్ణి ఆ భగవంతునికోసం తోడిజనాన్నీ ప్రేమించగలదా అనేది ముఖ్యం. మనం మఠంలో అడుగుపెట్టేది ప్రభువుమీదగల ప్రేమచేతనే. అక్కడ నిలువగలిగేదిగూడ ఆ ప్రేమవలననే. హృదయంలో ఈ ప్రేమ లేనివాళ్లు మరజీవితంలో రాణించలేరు.