పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండుమంది. వాళ్లు అతనితోగూడ వుండడానికీ, సువిశేషాన్ని బోధించడానికీ, దయ్యాలను వెళ్లగొట్టడానికీ నియమింపబడ్డారు" -మార్కు 3,13-15. మొదట ఈ వాక్యాల భావాన్ని పరిశీలిద్దాం. ప్రభువు తనకిష్టమైన వాళ్లను పిల్చాడు. పిలుపు అనేది దేవుడే స్వయంగా యిచ్చేవరం. 33 మిమ్మ ఎన్నుకొన్నాను అన్నాడు ప్రభువు. ఆలా పిలువగా శిష్యులు ఆయనవద్దకు వచ్చారు. పిలుపుఅంటే పాపపుప్రపంచాన్నుండి వేరుగావడమూ, పరిశుధుడైన భగవంతునికి అంకితంగావడమూ అని ముందే చెప్పాం. ఆలా వచ్చినవాళ్ల పండ్రెండుమంది. పూర్వవేదప్రజలకు పండ్రెండుమంది పితరులు నాయకులు, ఆలాగే నూత్నవేద ప్రజలకూ పండ్రెండుమంది ప్రేషితులు నాయకులు. ఈ పండ్రెండు మందిలో ఒకడైన యూదా పడిపోగానే అతనిస్థానంలో మత్తీయాను ఎన్నుకొన్నారు - అచ 1,26 ఈ శిష్యులు ప్రభువుతో వుండాలి. వాళ్లు ప్రభువుతో పరిచయం గలిగించుకొని అతనితో అన్యోన్యంగా మెలగాలి. అటుపిమ్మట సువిశేషాన్ని బోధించి దయ్యాలను వెళ్లగొట్టాలి. ఇది వాళ్ల పిలుపుయొక్క ప్రయోజనం.

2. శిష్యుల తర్ఫీదు

పరిశుద్దాత్మ దిగివచ్చాకగాని శిష్యుల తర్ఫీదు ముగియలేదు. అంతకుముందు ఓ పనిపిల్లకు భయపడిపోయిన పేత్రు ఆత్మదిగివచ్చాక యూదుల మహా సభముందు నిలబడి ధైర్యంగా బోధించాడు అంటే అది ఆ పరిశుద్ధాత్మ యిచ్చినవరమే. కాని క్రీస్తు నాడే వాళ్ల తర్ఫీదు ప్రారంభమైంది. వాళ్లు మూడేండూ క్రీస్తుతో వుండి అతనివలన తర్ఫీదు పొందారు. అతని బోధలు విన్నారు. అతడు చేసిన అద్భుతాలను చూచారు. అతన్ని నమ్మారు.

3. అన్నీ వదలివేసి

"మేము అన్నీ వదలివేసి నిన్ననుసరించాం" అన్నారు ప్రేషితులు క్రీస్తుతో - మార్కు 10, 28, యోహాను దప్పితే మిగిలిన ప్రేషితులంతా పెండ్లయినవాళ్లే. కావున వాళ్ళు ఆస్తిబాస్తులనూ, వృత్తినీ, యింటినీ, భార్యాపిల్లలనూ వదలివేసి వచ్చారనుకోవాలి. వాళ్లమీద ప్రభు ఆకర్షణం ఎంత బలంగా వుండేదంటే, వాళ్లతన్ని వదలి వెళ్ళేవాళ్లుకాదు. క్రీస్తు నా శరీరాన్నే మీకు ఆహారంగా యిస్తానని కఠినమైనమాట చెప్పినంక గూడ వాళ్లు ప్రభుని విడనాడలేదు. "ప్రభో! మేము ఎవరిదగ్గరికెత్తాం, నిత్యజీవమిచ్చే పలుకులు గలవాడివి నీవే" అన్నారు - యోహా 6, 68. వాళ్ల విడిచిపెట్టి వచ్చిన ప్రపంచం ఇక వాళ్లకు తృప్తినీయలేదు. కనుక వాళ్లు అతన్నే అనుసరించగోరారు. ఈ సందర్భంలో పౌలుకూడ "నాకు జీవించడమంటే క్రీస్తు" అని వ్రాసికొన్నాడు – ఫిలి 1, 21.