పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక వివాహజీవితం కేవలం ఈలోకానికి సంబంధించింది. దానికి శాశ్వతస్థితి అంటూలేదు - మార్కు 12, 25.

కన్యాజీవితం ఈ లోకానికీ పరలోకానికీగూడ సంబంధించిందీ, శాశ్వతమైందీని.

5. ఏలా తెలిసికోవాలి?

సుందరిని తల్లిదండ్రులు మేనత్త కొడుకు సత్యానికిచ్చిపెండ్లి చేయాలనుకొన్నారు. కాని సుందరిమాత్రం ప్రక్కింటి యువకుడు రాజును పెండ్లి చేసికొంటానంది. తల్లి సత్యాన్ని చేసికొమ్మని కూతురుని దబాయించింది. కాని ఆ యమ్మాయి ఒప్పకోలేదు. రాజంటే తనకెంతో యిష్టం అనిచెప్పింది. ఇక్కడ ఈ "యిష్టం" ప్రధానం, గురుజీవితానికి కన్యాజీవితానికీ గూడ ఇదే నియమం వర్తిస్తుంది.మనకు గురుజీవితానికీ కన్యాజీవితానికీ పిలుపువుంటే ఆ జీవితంమీద ఓ విధమైన యిష్టం పడుతుంది. మనకు పిలుపు వుందా లేదా అని తెలిసికోవాలి అంటే ఈ యిష్టం అనే దానికంటె గొప్పగురుతు ఏమీలేదు. పరిశుద్దాత్మే మన హృదయంలో ఈ యిష్టాన్ని పుట్టిస్తుంది. పిలుపు లేనివాళ్లకు ఈలాంటి జీవితాన్ని ఎన్నుకోవాలంటే యెంతో అనిష్టంగా వుంటుంది. ఈ యిష్టం కొందరిలో స్పష్టంగాను బలంగాను వుంటుంది. కొందరిలో అంత స్పష్టంగా వుండదు. మనకు గురుజీవితంమీదా కన్యాజీవితంమీదా పెద్ద యిష్టం కన్పించక పోయినా, అనిష్టం మాత్రం వుండకూడదు. పిలుపుకి ఇది చాలు.

పిలుపుకి ఇష్టం ప్రధాన లక్షణం అన్నాం, కాని పిలుపు వున్నవాళ్లల్లో ఈ యిష్టంతోపాటు కొన్ని అప్రధాన లక్షణాలు కూడ కన్పిస్తాయి. అవి దేవద్రవ్యానుమానాలమీద ఆశ, చావైన పాపాలను మానుకోవడం, చెడు సవాసాలకు పోకుండా వుండడం, విరక్తత్వంపట్ల ప్రీతి, లోకంలోని ఆడంబరాలమీద ఆట్టే రాజు పెట్టుకోకుండా వుండడం, నిరాడంబర జీవితం, దేవమాతపట్ల భక్తి తోడి ప్రజలకు ఏదో మేలు చేద్దామన్న కోరిక - మొదలైనవి. ఈ లక్షణాలన్నీ మనలో వుండనక్కరలేదు. వీటిల్లో కొన్ని వున్నా చాలు. ఈ పిలుపు విషయంలో సందేహం కలిగినపుడు పెద్దలూ తల్లిదండ్రులూ ఆత్మగురువులూ మొదలైన వాళ్లను సలహా అడగాలి.

ఇంకా, క్రైస్తవప్రజలను నడిపించేది పరిశుద్దాత్మ- రోమా 8,14. పిలుపుద్వారా మనలను గురుజీవితానికీ కన్యాజీవితానికీ నడిపించేదిగూడ ఆయాత్మే కనుక గురువూ మఠకన్యా కావాలనుకొనేవాళ్లు ఆయాత్మ సహాయం అడుగుకోవాలి. మనం ఏడ్రోవవెంట వెళ్లాలో తెలియజెప్పమనీ, మనహృదయంలో మాటలాడమనీ ఆయాత్మను అడుగుకోవాలి.

6. ఎవరిలో చేరాలి?

చాలరకాల గురువులున్నారు. అదేవిధంగా అమ్మగార్లకు గూడ చాల మఠసభలున్నాయి. యువతీయువకులకు ఏ గురువుల్లో, లేక ఏ యమ్మగార్లల్లో చేరితే