పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుందనుకోండి. మీరు ఆ పొదుగుతూవున్న తల్లిపక్షిని పట్టుకొని పోకూడదు. కావాలంటే పిల్లలను తీసికోండి గాని తల్లిని మాత్రం పట్టుకోవద్దు. ఈలా చేస్తే మీకు దీర్గాయవు కలుగుతుంది. మీరు వృద్ధిలోకి వస్తారు గూడ" -22,6-8. పూర్వం రాజులు శత్రుపట్టణాలను పట్టుకొన్నపుడు అక్కడి పండ్లచెట్లను నరికించేవాళ్లు, పాలస్తీనా దేశంలో శత్రువులు విశేషంగా ఓలివలూ, ద్రాక్షలు, అత్తిచెటూ కొట్టించారు. కాని ధర్మశాస్త్రకారుడికి ఈ పద్ధతి నచ్చలేదు. కనుక అతడు యూదులు శత్రునగరాలను ఆక్రమించుకొన్నపుడు అక్కడి పండ్లచెట్లను ముట్టుకోవద్దని శాసించాడు. "మీరేదైనా శత్రునగరంమీద బడి ముట్టడి కొనసాగించేపుడు అక్కడి చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు. ఆ చెట్ల పండ్లను భుజించండిగాని వాటిని నరికి వేయకండి. పొలంలోని చెట్లను గూడ ముట్టడించడానికి అవేమి నరులాయేమిటి?" - 20,19. ఈలాంటి కరుణాపరితాలైన శాసనాలను పేర్కొందిగనుకనే మోషే ధర్మశాస్త్రం ఆనాటి సమకాలీన ధర్మశాస్తాలన్నింటికంటె మిన్నయైనదని చెప్తారు.

కడన ఒక్క ప్రశ్న అడగాలి. ధర్మశాస్త్రం ఇన్ని మంచి శాసనాలు చేసింది. పేదలను పీడించవద్దనీ సాంఘికన్యాయం పాటించమనీ చెప్పింది. కాని యూదులు ఈ నియమాలను పాటించారా? ధర్మశాస్త్రకారుడు ఎంతవరకు కృతకృత్యుడయ్యాడు? యూదులు చాలమంది స్వార్థబుద్ధితో ఈ శాసనాలను పాటించలేదు. ఈ నియమాలను లెక్కచేయకుండా పేదలను పీడించదల్చుకొన్నవాళ్ల పీడించారు. ఐనా తోడినరుణ్ణి పీడించాలి అని మానవుడి హృదయాంతరాళంలో సహజంగానే వుండే దుష్టవాంఛను ఈ నియమాలద్వారా ధర్మశాస్త్రం కొంతవరకైనా అరికట్టిగలిగింది. ఈ దృష్టితో పరిశీలిస్తే ధర్మశాస్త్రం సాంఘికన్యాయాన్ని బోధించి, అమలుపరచి, పేదవాడికి రక్షణ చేకూర్చిందనే చెప్పాలి.

3. సాంఘిక న్యాయమూ, అధికారులు

న్యాయాధిపతులూ రాజులూ సాంఘికన్యాయాన్ని రక్షించాలి, వీళ్ళను ఈ పదవుల్లో నిల్పిన ప్రభువే సాంఘిక న్యాయాన్ని కాంక్షించేవాడు. కనుక అతనివల్ల అధికారంలోకి వచ్చినవాళ్లుకూడ న్యాయాన్నికాపాడాలి. ఇంకా ధనవంతులు కూడ సాంఘిక న్యాయాన్ని సంరక్షించాలి. ఈ మూడు వర్గాలవాళ్ళూ ఈ ధర్మాన్ని ఏలా పాటించాలో పరిశీలిద్దాం.

1. న్యాయాధిపతులు

యిస్రాయేలు న్యాయాధిపతులు రెండురకాలుగా వుండేవాళ్లు, మొదటిరకంవాళ్లు ఆయా గోత్రాలకు పెద్దలు. వీరు నగర ద్వారంవద్ద కూర్చుండి తగాదాలు పరిష్కరించేవాళ్ళ,