పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక అతడు చాల జాగ్రత్తగా ప్రవర్తించాలి. చాల వినయంతోను అణకువతోను మెలగాలి. నాయకునికి కలిగే మామూలు శోధనల్లో నాల్గింటిని గూర్చి ప్రస్తుతం విచారిద్దాం. అవి ప్రమత్తత, గర్వం, ధనవాంచ, మురాతత్వం.

1. ప్రమత్తత

నాయకులకు దేవుడు ఓ పదవినీ, ఓ బాధ్యతను ఒప్పజెపుతాడు. ఆ బాధ్యత ప్రకారం ప్రవర్తించకపోతే ప్రభువు వాళ్ళను కఠినంగా శిక్షిస్తాడు. ఎంత చెట్టుకి అంతగాలి గదా! పౌలు చాల గొప్ప నాయకుడు. కాని ఆ నాయకత్వం వల్ల తల దిరిగి భ్రష్టుణ్ణ్తె పోతానేమోనని అతడు చాల భయపడ్డాడు - 1 కొ 9,27. సంసోను న్యాయాధిపతి, నాయకుడు. కాని అతడు స్త్రీలోలుడయ్యాడు. డెలీలాకు దాసుడయ్యాడు. కనుక ప్రభువు అతన్ని పరిత్యజించాడు. సంసోను ప్రభువు తన్ను విడనాడి వెళ్ళిపోయాడని గుర్తించనైనా లేదు. అంతటి దౌర్భాగ్యుడయ్యాడు - న్యాయా 16,20. ఎడారి ప్రయాణంలో మాసా మెరిబాలవద్ద నీళ్ళ దొరకక యిప్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగబడ్డారు. దేవుడు మోషేను పిలిచి బెత్తంతో రాతి బండను చరవమని చెప్పాడు. కాని మోషే బండనుండి నీళ్లు పడతాయా అని సందేహించాడు. అందుచేత యావేకు అప్రియం కలిగింది. ప్రభువు అతన్ని వాగ్డత్త భూమిలో ప్రవేశింప నీయలేదు. అతని నాయకత్వాన్నిగూడ యోషువాకు ఇచ్చివేసాడు. ఈ విధంగా ప్రభువు తన నాయకుల లోపాలను కఠినంగా శిక్షించాడు. ఔను, అధికంగా పొందినవాళ్లు అధికంగానే లెక్క ఒప్పజెప్పాలి గదా! - లూకా 12,48.

దేవుడు మనకు గొప్ప శక్తిసామర్థ్యాలను ప్రసాదించినపుడు వాటిని సద్వినియోగం జేసికొంటున్నామా అని కూడ పరిశీలిస్తాడు. లోపమూ పాపమూ అనేవి యెవరిలో కన్పించినా దేవుడు సహింపడు. పాపాల నిమిత్తమై అతడు తన ఏకైక కుమారుని గూడ కరుణింపలేదు - రోమీ 8,31. ఇక మన నాయకత్వపు పాపాలను క్షమిస్తాడా? కనుక నాయకులు జాగరూకతతో ప్రవర్తించాలి. నాయకత్వపు తొలి రోజుల్లో గాదు గాని, కొంతకాలమైనంక చాలమంది నాయకులు అశ్రద్ధ జూపుతూంటారు. దీమాగా ప్రవర్తిస్తూంటారు. ఇది పెద్ద పొరపాటు.

2. గర్వం

విశేషంగా మూడు గుణాలు నాయకులను తప్పుదారి పట్టిస్తాయి. అవి అధికారభావమూ, పలుకుబడీ, గర్వమూ, అధికారభావంవలన చెడిపోనివాళ్లు అరుదు. నాయకులూ' అంతే. పలుకుబడివలన నాయకులు కన్నుమిన్ను కానకుండా తిరగడం కూడ కద్దు. ఇక, నాయకత్వం వలన కొంతమందికి తల తిరుగుతుంది.అదే గర్వం. ఈ దుష్టగుణాల కన్నిటికీ విరుగుడు ఏమిటి? సేవా భావం. నాయకత్వమంటే ప్రధానంగా సేవ అని గ్రహించడం.