పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ప్రభుధర్మశాస్తాన్ని అమలు పరచినవాడు. అతడు ప్రజలను వాగ్డత్త భూమికి చేర్చక ముందే త్రోవలోనే నాయకత్వాన్ని విసర్జించవలసి వచ్చింది. ప్రభువు అతని స్థానే యోషువాను నాయకునిగా ఎన్నుకొన్నాడు. ప్రభు చిత్తం తెలిసికొన్నవెంటనే మోషే దైవాజ్ఞకు బదుడై యోషువా మీద చేతులు చాచి అతన్ని నాయకునిగా నియమించాడు. తాను అధికారంనుండి వైదొలగాడు - సంఖ్యా 27, 22-23. అతడు ఎంతటి నాయకుడో అంతటి వినయవంతుడు.

ఈలాగే మహా ప్రవక్తయైన యేలీయా నాయకత్వం విడనాడవలసిన రోజు వచ్చింది. ప్రభువు యెలిషాను ప్రవక్తగా నియమించాడు. కనుక యేలీయా యెలిషాను వెదకబోయాడు. అతడు వచ్చేప్పటికల్లా యెలిషా పన్నెండు కాండ్ల యెదులతో పాలం దున్నిస్తూన్నాడు. తాను చివరి కాడి దున్నుతూన్నాడు. యేలీయా తన ఉత్తరీయాన్ని తీసి యేలీయా మీద కప్పాడు. దానితో యెలిషా యేలీయా స్థానాన్ని పొంది ప్రవక్త అయ్యాడు - రాజు 19, 19-21. యేలీయా తన ఉద్యోగాన్ని విరమించుకొని దేవుని చేరుకొన్నాడు.

ఈ లాగే స్నాపక యోహాను క్రీస్తు వచ్చిందాకా మహా జ్యోతిగా వెలిగాడు. కాని క్రీస్తురాకతో ఆతని నాయకత్వ మంతరించింది. యోహాను వినయంతో "అతడు అతిశయించాలి, నేను తగ్గిపోవాలి" అన్నాడు - యోహా 3,30. తరువాత హెరోదు యోహానును వధించాడు, ఆతని శిష్యులు క్రీస్తు శిష్యులయ్యారు.

మోషే, యేలీయా, యోహాను మొదలైన బైబులునాయకులంతా తమ రోజు వచ్చినపుడు వినయంతో నాయకత్వం వదలుకొన్నారు. ఈ మహానుభావులు మనకు ఆదర్శంగా వండాలి. చాలమంది క్రైస్తవనాయకులు తమ నాయకత్వాన్ని వదలుకోవడానికి ఒప్పుకోరు. వృద్దులైన నాయకులు అసలే ఒప్పుకోరు. ఏవేవో తంత్రాలు పన్ని సాకులు చెప్పి ఉద్యోగానికి అంటిపెట్టుకొనివుంటూంటారు. పదిమంది చేత “చీ" అనిపించుకొనిగాని పదవి నుండి వైదొలగరు. ఆలా వైదొలగినంక గూడ, తమ స్థానాన్ని పొందినవాళ్ళ అధికారంలో ఇంకా జోక్యం గలిగించుకో గోరుతూంటారు. నాయకులు ఈ యవివేక ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి. ఓ మారు ప్రభుచిత్తం తెలిసికొన్నంక వాళ్ళంతట వాళ్లే శీఘ్రంగా పదవీ విరమణం చేసి ప్రక్కకు వైదొలగాలి. బహుశః ప్రభువు మన తరువాత మన కంటె యోగ్యులను, మనకంటె సమర్థులను పదవిలో నియమించవచ్చుగదా!

6. నాయకుని శోధనలు

పిశాచం క్రీస్తుని ఉన్నతమైన పర్వత శిఖరంమీదా, దేవాలయ గోపురంమీదా నిల్పి శోధించింది. నాయకుడు గూడ ఓ గొప్ప పదవిని పొందుతాడు. ఓ ఉన్నత స్థానంలో నిలుస్తాడు. కాని ఈ ఉన్నత స్థానమే ఒకోమారు అతని పతనానికి కారణమౌతుంది.