పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా కిప్పుడు వ్యవధిలేదు, మరోమారు వింటాంలే" అని గేలి చేసారు. ఇవి పౌలు అపజయాలు. ఐనా పౌలునకు మించిన ప్రేషితుడెవరు?

కడన క్రీస్తు కూడ పరాజయం పొందాడు. అతని మరణకాలంలో అంతా అపజయమే ననిపించింది. అతడు వృథాగా ప్రాణత్యాగం చేసినట్లనిపించింది. కాని ఆ పరాజయం నుండే మహా జయం పుట్టుకవచ్చింది. అందుచేత క్రైస్తవ నాయకులు అపజయానికి భయపడకూడదు. నాయకత్వంలో అపజయం కూడ ఒక భాగం. సమస్యలు, పరీక్షలు, శ్రమలు, అపజయాలు అనే తంతువులతోగాని భగవంతుడు నాయకత్వమనే వస్తాన్ని నేయడు. ఐనా "దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అన్నీ సవ్యంగానే పనిచేస్తాయి" - రోమా 8,28. ఈ వాక్యాన్ని విశ్వసించి క్రైస్తవ నాయకుడు తన అపజయాలకు నిరుత్సాహపడకుండా ముందునకు సాగిపోతుండాలి.

5. నాయకుని సమస్యలు

నాయకుడు ఎదుర్కొనే సమస్యలు బోలెడన్ని ఉంటాయి. కొందరి దృష్టిలో నాయకత్వమంటే ఒకదాని తరువాత ఒకటిగా చిక్కులను విషమ సమస్యలను ఎదుర్కొంటూండడమే. ఐనా ఈ సమస్యలను ఎదుర్కొనడం ద్వారా గాని నాయకుడు పరిపూర్ణ మానవుడు కాలేడు. నాయకుడు ఎదుర్కొనే సమస్యలు ఎన్నైనా వుంటాయన్నాం. ప్రస్తుతానికి వాటిల్లో రెండింటిని మాత్రం పరిశీలిద్దాం.

1. అధికార నిర్వహణం

నాయకత్వాన్ని సక్రమంగా నిర్వహించగలమా అన్నదే ఓ పెద్ద సమస్య. ఓ మారు షెబా రాణి సొలోమోనును చూడవచ్చింది. ఆమె అతని విజ్ఞానాన్నిచూచి మెచ్చుకొని "నీవలన ప్రీతి జెంది నిన్ను యిప్రాయేలు సింహాసన మెక్కించిన ఆ ప్రభువు స్తుతింప బడునుగాక” అంది - 1 రాజు 10,9. ఈ వాక్యాన్ని బట్టి సొలోమోనును సింహాసనమెక్కించింది ప్రభువే. సర్వధికారమూ దేవుని వద్దనుండే వస్తుంది. ప్రభువే దానికి ఆధారం. మనం దేవునికి ప్రతినిధులం, అతని వద్ద నుండి అధికారం పొందేవాళ్ళం. కనుక అధికారం మన జన్మహక్కనీ, మన వ్యక్తిత్వానికి సంబంధించిందనీ అనుకోవడం వెర్రి, నాయకత్వ మంటే అధికారం. కాని ఆ యధికారాన్ని జూచుకొని కన్నుమిన్ను గానకుండ ప్రవర్తించ గూడదు. అధికారం పరసేవకుగాని ఆత్మోత్కర్షకు గాదు.

రోమను సైన్యాధిపతి క్రీస్తుతో "నేనూ అధికారం క్రింద బ్రతికేవాణ్ణె" అన్నాడు - మత్త 7,9. అతడు రోము అధికారం క్రింద పనిచేస్తూన్నాడు గనుక ఆ రోమను సైన్యాన్ని ఆజ్ఞాపింపగలిగాడు. మనం కూడ క్రీస్తు అధికారం క్రింద పనిచేస్తూన్నాం గనుకనే