పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏ మఠాతోనో చేతులు కలుపుతూంటారు. కాని యథార్థమైన నాయకుడు ఈలా చేయడు. అతడు మానవ బలంమీదకంటె దైవబలంమీద అధికంగా ఆధారపడుతూంటాడు. ఒంటిరివాడైనా సరే, నరుల ముఠాలతో అతనికి పనిలేదు. బలం కొరకు ఎవరి పక్షాన్నీ ఆశ్రయించడు. దేవుని మీద ఆధారపడి జీవిస్తూంటాడు, అంతే. ఈ సత్యాన్నిగ్రహించనివాళ్లు ఉత్తమ నాయకులు కాలేరు. ఒంటరితనానికి భయపడేవాడు నాయకత్వపు పరీక్షలో ఓడిపోయినట్లే.

4 అపజయం

నాయకుడు అపజయాన్ని భరించగలిగాడా లేదా అన్నది కూడ నాయకత్వానికి ఓ పెద్ద పరీక్ష జీవితంలో అపజయం పొందని నాయకుడంటూ లేడు. మోషే యావే తరపున నాయకత్వం వహించి ఫరో దగ్గరకు వెళ్ళి యిస్రాయేలు ప్రజలను పంపివేయమని అడిగాడు. ఫరో ఆ ప్రజలను పంపివేయలేదుగదా ఇంకా ముప్పుతిప్పులు పెట్టించాడు. ఇంకోమారు మోషే యావేనుండి పది ఆజ్ఞలు పొందడానికై కొండమీదికి వెళ్ళగా క్రిందనున్న ప్రజలు యావేను విడనాడి బంగారు దూడను ఆరాధిస్తూ కూర్చున్నారు, మరోమారు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ మాసా మెరీబా అనే తావులో నీళ్ళ దొరక నందున మోషే మీద తిరుగుబాటు చేసారు. ఇక ముందుకు కదలమని మంకుపట్టు పట్టారు. ఇవన్నీ మోషే అపజయాలు. ఐనా అతనికి మించిన నాయకుడెవరు?

ప్రవక్త యేలీయా కాలంలో ఆహబు రాజు యెసబెలురాణి యావే ఆరాధనను అరికట్టి బాలు ఆరాధనను ప్రోత్సహించారు. అందుచేత ప్రవక్త రాణిని ఎదిరించి నిలిచాడు. కాని ఆమె క్రోధానికి తట్టుకోలేక యేలీయా హోరెబు కొండకు పారిపోవలసివచ్చింది. ఇది యేలీయా అపజయం. ఐనా చివరకు ఆ రాణి గతిలేని చావు చచ్చింది, ప్రవక్త నెగ్గాడు.

దావీదు మహాభక్తుడు, మహావీరుడుకూడ ఐనా అతడు పొందిన అపజయాలకు లెక్కలేదు. సౌలు ఎదుటినుండి పారిపోయి చాలకాలం కాందిశీకుడుగా బ్రతికాడు. ఓ మారు తన కుమారుడు అబ్వాలోము చేతుల్లో బందీ అయ్యాడు. ఇంకోమారు స్వీయ బలహీనతవల్ల తనకు తానే బందీ అయ్యాడు. ఊరియాను చంపించి అతని భార్య బతేబాను చేపట్టాడు. అప్పుడు నాతాను ప్రవక్త తన్నుకఠినంగా మందలించగా పశ్చాత్తాప పడ్డాడు. ఇన్ని అపజయాలు పొందినా యిస్రాయేలు రాజుల్లో దావీదును మించినవాడు లేడు. పౌలు మహాప్రేషితుడు. ఐనా కొందరు శిష్యులు అతనిని అపార్థం చేసికొన్నారు. అతని ప్రేషిత కార్యాన్ని భగ్నంచేసారు. అతనికి ప్రక్కలోని బల్లెంలా తయారయ్యారు. వీళ్ళనుగూర్చే అతడు "నా శరీరంలో గ్రుచ్చుకొన్న ముల్ల" అని పేర్కొన్నాడు. ఓ మారు అతడు ఆతెన్సు నగరంలోని గ్రీకు పండితులకు బోధించగా వాళ్లు "నీ బోధలు వినడానికి