పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తర్ఫీదు నీయడం కడ్డడాలు కట్టడం కంటె ముఖ్యం. మనం కట్టిన హైసూళ్లల్లో కాలేజీల్లో ఆసుపత్రుల్లో ప్రజలు కొన్నియేండ్లకాలం గడపవచ్చు, కడన క్రీస్తును అర్థం చేసికోకుండానే వెళ్ళిపోవచ్చుగూడ. కట్టడాలు చాలవనడానికి ఈ నిదర్శనం ఒక్కటి చాలదా?

2. క్రీస్తు బోధ

ప్రభువు పేత్రుని జూచి “నీ పేరు రాయి. ఈ రాతిమీద నా తిరుసభను కడతా" నన్నాడు - మత్త 16,18. అతడు తన బోధ ద్వారా నిలకడలేని పేత్రుని స్థిరమైన రాయినిగా తయారు చేసాడు. యాకోబు యోహాను, తల్లిచే ప్రబోధితులై వచ్చి పరలోకరాజ్యంలో క్రీస్తు సింహాసనానికి ఇరువైపుల ఆసీనులు కావాలని కోరుకొన్నారు. క్రీస్తు వాళ్లను మందలిస్తూ మీరు నా బాధలూ సిలువమరణమూ అనుభవింపగల్గినచో మీకా తావులు లభిస్తాయని నుడివాడు - మత్త 20,23. మరోమారు ఈ యిద్దరు శిష్యులే సమరయులు క్రీస్తును ఆదరించకపోవడం జూచి వాళ్లమీదికి నిప్పులూ ఉరుములూ దిగిరావాలని కోరుకొన్నారు. క్రీస్తు వాళ్లను మందలించి ప్రేమభావాన్ని నేర్పాడు - లూకా 9,54. ఈ లా క్రీస్తు శిష్యుల దైనందిన జీవితంలోని సన్నివేశాలనూ సంఘటనలనూ, శోధనలనూ ఆధారంగా దీసికొని వాళ్లకు బోధించేవాడు. దీనివల్ల వాళ్లు రోజురోజుకీ ఆధ్యాత్మిక జీవితంలో పెంపజెందుతూ వచ్చారు. ఈలాగే మనం కూడ క్రీస్తు బోధలను జీర్ణంచేసికొంటేనేగాని క్రైస్తవ నాయకులం గాలేం, క్రైస్తవ నాయకులను తయారు చేయలేం.

8. క్రీస్తు మాతృక

అన్నిటికంటె ముఖ్యంగా క్రీస్తు మాతృక శిష్యులకు నచ్చింది. అతడు తాను ఆచరించనిదేదీ శిష్యులకు బోధించలేదు. యోహాను తన తొలి జాబును ప్రారంభిస్తూ "మేము చెవులార ఎవరి బోధలు విన్నామో, కన్నులార ఎవరి కార్యాలు చూచామో, చేతులార ఎవరిని తాకి చూచామో ఆ జీవవార్తయైన క్రీస్తును గూర్చి మీకు బోధిస్తున్నాం" అంటాడు 1,1. ఆ ప్రభువును గూర్చి శిష్యులకు కలిగిన అనుభవం ఆలాంటిది, అతడు వారికి చూపిన మాతృక ఆలాంటిది. అతని మాటలకూ చేతలకూ సరిపోయింది. అందుకే ఆ నాయకుణ్ణి వాళ్ళు నమ్మారు. నేడు మన మాటలకూ చేతలకూ పొందిక కుదరడం లేదు కనుకనే ప్రజల మన నాయకత్వాన్ని నమ్మడం లేదు. మనం కూడ ఇతర నాయకులను తయారు చేయలేకపోతున్నాం. ప్రభువులాగ నిజాయితీ చిత్తశుద్ధికల నాయకులు కావాలి. మాటల ద్వారా మాత్రమే గాకుండ చేతల ద్వారా గూడ నాయకులను తయారుచేసేవాళ్లు దొరకాలి. అప్పుడు గాని క్రైస్తవ నాయకత్వం సార్థకంగాదు.