పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా దేవుడే క్రైస్తవ నాయకులను నియమించినపుడు క్రైస్తవ సమాజాలు వృద్ధి చెందుతాయి. అలా కాకుండ ప్రజలే తమకిష్టమైన నాయకులను నియమించుకొనినపుడు సమాజాలు క్షీణించిపోతాయి. మనం తరచుగా బంధుపక్షపాతంతోనో, కులపక్షపాతంతోనో, లేక పలానా వ్యక్తిలో ప్రాకృతికమైన శక్తిసామర్థ్యాలు అధికంగా వున్నాయన్నభావంతోనో ఆయా వ్యక్తులను నాయకులనుగా నియమిస్తూంటాం. కాని ఇవన్నీ వెలుపలి రూపాన్ని జూచి నాయకులను ఎన్నుకోవడం. ఈ పద్ధతి ప్రభువుకి సమ్మతం గాదు. దావీదు అన్న యెలియాబు పొడవైనవాడు, చక్కని ఆకృతి కలవాడు. ఈ యెలియాబు రూపాన్ని జూచి మురిసిపోయి సమూవేలు ప్రవక్త సౌలు స్థానే అతన్ని రాజుగా అభిషేకింపబోయాడు. కాని ప్రభువు సమూవేలుతో "ఇతని ఆకృతినిజూచి బ్రమసిపోవద్దు. నేను ఇతనిని నిరాకరించాను. నరుడు వెలుపలి రూపాన్ని చూస్తూంటాడు. కాని భగవంతుడు హృదయాన్ని పరిశీలిస్తూంటాడు" అని మందలించాడు - 1స 16,7. ఈ వాక్యం పక్షపాతంతో గూడిన మన నియామకాలన్నిటినీ ఖండిస్తుంది గదా!

క్రీస్తు ఎన్నుకొనిన శిష్యులను పరిశీలిద్దాం. వాళ్ళు ఆనాటి సమాజంలో పేరుప్రతిష్టలు కలవాళ్లు కాదు. ఒట్టి అనామకులు, అసమర్శలు, నిరుపేదలు. ఐనా ప్రభువు అలాంటి వాళ్ళనే ఎన్నుకొన్నాడు. సువిశేషాలుకూడ ఈ శిష్యుల్లో ఆరురినిగూర్చి మాత్రమే కొన్నివివరాలైనా చెప్తాయి. పేత్రు, అందైయా, యొహాను, యాకోబు, మత్తయి, తోమా - వీళ్లను గూర్చి మాత్రమే మనకు కొంత బోగట్టా తెలుసు. మిగతా ఆరురిని గూర్చి సువిశేషాలు అట్టే మాటలాడవు. మరి వీళ్లలో ఏమి గొప్పతనం జూచి ప్రభువు వీళ్లను ఎన్నుకొన్నట్లు? దేవుడు హృదయాలను పరీక్షించేవాడన్నాం. కనుక వీళ్లు నిర్మల హృదయులై యుండాలి. వీళ్లు విశ్వాసంతో ప్రభువును అనుసరించారు, ప్రేమభావంతో అతన్ని సేవించారు. కనుకనే తండ్రి రాజ్యంలో పన్నెండు సింహసనాలను ఆక్రమించుకోవడానికి అరులయ్యారు. ఈ పన్నెండు మంది ఆత్మపూర్ణులు.

క్రైస్తవ నాయకునికి ఉండవలసిన ప్రధానార్హత ఆత్మచేత నిండివుండడం. ప్రాకృతికమైన జ్ఞానమూ శక్తిసామర్ధ్యాలూ అవసరమేగాని, ఆధ్యాత్మిక జ్ఞానమూ పరిశుద్దాత్మలేందే అవెందుకూ కొరగావు. పరిశుద్దాత్మ నిండివుండే వ్యక్తుల్లో "నేను""నాది" అనేతాపత్రయం అట్టే కనిపించదు. వాళ్లు సేవాపరులూ వినయవంతులూ ఐయుంటారు. మేము ఇంతటివాళ్లం అంతటివాళ్లం అనుకొని విర్రవీగరు. భగవంతుని మీద ఆధారపడి జీవిస్తూంటారు. ఈలాంటివాళ్లనే నాయకులనుగా ఎన్నుకోవాలి.

మనం, క్రొత్త నాయకులను నియమించేపుడు రెండు విషయాలు పాటించాలి, మొదటిది, యోగ్యుడైన నాయకుణ్ణి ప్రసాదించమని ప్రభువుని ప్రార్థించాలి. మోషే నాయకత్వం చాలించవలసిన రోజులు వచ్చాయి. ప్రజలకు ఎవరిని నాయకునిగా