పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జెందాడు - మార్కు 6,34. క్రైస్తవ నాయకునికి ఈ జాలి, ఈ ప్రజాదరణం అత్యవసరం. అసలు అతని దృష్టిలో ప్రజలూ వాళ్ళ అక్కరలూ మొదట లెక్కింపబడాలి. అనగా అతనికి కరుణా హృదయమూ, ఇతరులకు సేవచేసే హృదయమూ ఉండాలి.

పౌలు స్నేహితుడు బర్నబా.ఇతడు ఇతరులలోని మంచితనాన్ని వెలికిదీసే శక్తిగలవాడు. డమస్క త్రోవలో ప్రభు దర్శనం పొంది క్రీస్తుశిష్యుడైనంక కూడ పౌలు ఏం చేయడానికీ తోచక స్వీయపట్టణమైన తార్సులో తిరుగాడుతూన్నాడు. పేత్రు మొదలైన శిష్యులు అతన్ని అనుమానించడంవల్ల అట్టే ఆదరం జూపలేదు. కొంతకాలంవరకు పౌలు అనామకుడుగా వుండిపోయాడు. ఆ పరిస్థితుల్లో బర్నబా తార్సు పట్టణానికి వెళ్ళి పౌలును కలసికొని అతన్ని ప్రోత్సహించాడు. అతన్నిఅంటియోకయకు కొనివచ్చి అక్కడి శిష్యులతో పరిచయం గలిగించాడు. తర్వాత పౌలు క్రమేణ ప్రసిద్ధిలోనికి వచ్చాడు - ఆచ 11, 25-26.

ఆలాగే మార్కుకూడ. ఈ మార్కు పౌలు శిష్యుడుగా పనిజేస్తూ ఓ మారు పప్పులో కాలువేసాడు, పౌలు అతన్ని తన శిష్యవర్గం నుండి బహిష్కరించాడు. కాని బర్నబా మాత్రం మార్కుని దీసికొని అతన్ని ప్రోత్సహించాడు. పిమ్మట మార్కు పేత్రు శిష్యుడయ్యాడు, సువిశేషం వ్రాసాడు - అచ 15,39.

ఈలా బర్నబా మంచి కాపరి లాగ వ్యవహరించాడు. మంచి కాపరి తోడి ప్రజల చేత సేవలు చేయించుకోడు. మంచి కాపరి తోడి ప్రజలకు సేవలు చేసిపెడతాడు. వాళ్ళకొరకు ప్రాణాలు సమర్పిస్తాడు. ప్రేమ హృదయమూ, ప్రజాదరణమూ కలవాళ్ళుగాని క్రీస్తు ప్రజలనే మందలకు మంచి కాపరులుగా వ్యవహరించలేరు. ఈ మంచి కాపరులే మంచి నాయకులు, ప్రేమగల నాయకులు, కనుక ఈ లాంటి మనస్తత్వం తమలో వుందో లేదో నాయకులు ఆత్మపరీక్ష చేసి చూచుకొంటూండాలి.

2. నాయకుని నియామకం

ప్రాత నాయకులు గతించిపోయేకొలది క్రొత్త నాయకులను నియమిస్తూండాలి. కాని ఈ క్రొత్త నాయకులను ఎన్నుకొనేదెవరు? మనమా, దేవుడా? సమూవేలు సౌలు రాజుతో దావీదు నియామకాన్ని గూర్చి మాటలాడుతూ "ప్రభువు తన కొరకు ఓ నాయకుణ్ణి ఎన్నుకొన్నాడు" అని చెప్తాడు - 1 స 13,14. ప్రభువు సమూవేలుతో ప్రసంగిస్తూ "నేను నీకు చూపిన వానిని నీవు నా నాయకునిగా అభిషేకించాలి" అని చెప్పాడు - 1స 16,3. ఈ వాక్యాలను బట్టి మననాయకులను ఎన్నుకొనేది మనంగాదు, ప్రభువే. అందుకే కీర్తనకారుడు "ప్రభువు కొంతమందిని క్రిందికి దింపివేస్తుంటాడు, మరి కొంతమందిని పైకి లేవనెత్తుతుంటాడు" అంటాడు - 75,7. పౌలు ఎఫెసు పెద్దలతో ముచ్చటిస్తూ పరిశుద్ధాత్ముడే వాళ్ళను ఆ వుద్యోగానికి నియమించాడని పల్మాడు-అచ 20,28.