పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాసుడయ్యాడు. బయటకు మాత్రం సత్యవర్తనుడులా కన్పించాడు, వివేకంలేదు. గురువు కెంత విలువ నీయాలో, ముప్పైకాసుల కెంత విలవు నీయాలో, ఏది మంచో ఏదిచెడ్లో నిర్ణయించలేక పోయాడు. క్రైస్తవ నాయకులమైన మనంకూడ ఈ యూదాలాగ తయారౌతుంటాం, అతనిలాగ మనం కూడ ప్రభువును అప్పగింపబోతున్నామేమోనని నిత్యం ఆత్మపరీక్ష చేసికొంటూండాలి - మత్త 26,25.

2. విశ్వాసం

క్రైస్తవ నాయకుని కుండే రెండవలక్షణం విశ్వాసం. దేవుని యందు విశ్వాసం లేందే గొప్ప కార్యాలేమీ సాధించలేం, అసలు ఏపనిని సాధించాలన్నా సందేహాలూ అనుమానాలూ వేలాదిగా రేకెత్తుతూంటాయి. వీటిని జయించాలంటే విశ్వాసం అవసరం. ఇక్కడ విశ్వాసమంటే మూడు విషయాలు - దూరదృష్టి, ధైర్యం, నమ్మిక. ఈ మూడు విషయాలను క్రమంగా విచారిద్దాం.

1. దూరదృష్టి

 క్రైస్తవ నాయకుడు భౌతిక నేత్రాలతో లౌకిక విషయాలను మాత్రమేగాక, జ్ఞాన దృష్టితో ఆధ్యాత్మిక విషయాలనుగూడ గుర్తిస్తూండాలి. అతడు తోడివారికంటె ముందుగా భగవంతుని మార్గాలను తెలిసికొంటూండాలి. భగవంతుడు ఆయాకాలాల్లో ఆయా ప్రజలకు అనుగ్రహింపదలచుకొన్న భాగ్యాలనుగూడ పసికడుతుండాలి. భగవంతుని కొరకు తోడి ప్రజలకొరకు, క్రొత్తపనులను చేపడుతుండాలి, ప్రాత పనులలో నూత్న చైతన్యాన్ని ప్రవేశపెడుతుండాలి. ఇతరులను కూడగట్టుకొని వసూండాలి. ప్రోత్సహిస్తూండాలి. ఎక్కడ క్రొత్తదనమనేది లేదో అక్కడ క్రైస్తవ సంస్థలు పాడుబడిపోయిన కొంపల్లాగ బావురు మంటూంటాయి. దేవుని కొరకు క్రొత్త జాతిని రూపొందించిన అబ్రాహాము దూరదృష్టి కలవాడు. దేవుని ప్రజలను బానిసమునుండి విడిపించి స్వేచ్చాపరులను జేసిన మోషే దూర దృష్టిగలవాడు. అన్యజాతులకు క్రీస్తును బోధించి ఆ బోధలను లేఖల రూపంలో వెలువరించిన పౌలు దూరదృష్టిగలవాడు. ఈ క్రియాపరులంతా క్రైస్తవ నాయకులకు మార్గదర్శకులు

2.దైర్యం

క్రైస్తవ నాయకునికి ధైర్యం కూడ అత్యవసరం. పౌలు దెవునీ బలాన్ని పొంది తన పనిని కొనసాగించుతూన్నట్లు వ్రాసికొన్నాడు. ఓ ఆపదలో అందరూ పౌలును విడనాడారు. ఐనా ప్రభువు మాత్రం అతనిని సమీపించి తన బలాన్ని ప్రసాదించాడు - అచ 23, 11. ప్రభువు తన ముఖాన్ని యెరూషలేము వైపు త్రిప్పి దీక్షతో, ధైర్యంతో ఆ