పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయాహృదయులను దేవుడు దయతో చూస్తాడనీ, వాళ్ళ తప్పిదాలను క్షమిస్తాడనీ ఈ వాక్యం భావం.

ఏమైతేనేమి ప్రేమ - అది దేవుని ప్రేమ కానీయండి లేక తోడి నరుని ప్రేమ కానీయండి - మన తప్పిదాలను క్షమిస్తుంది. దానిలో క్షమాగుణం వుంది. అలాంటి ఉత్తమ పుణ్యాన్ని మనం తప్పకుండా సాధించాలి.

ముగింపు

నూతవేదం ప్రేమను గూర్చి చెప్పే సంగతులను ఇక్కడ సంగ్రహంగా వివరించాం. ఈ సోదరప్రేమ దేవుడిచ్చే వరం. పరిశుద్ధాత్మే ప్రేమ.

క్రైస్తవుడికి ముఖ్యమైంది ప్రేమేనని చెప్పాం. కనుక క్రైస్తవుడంటే యెవడు? తోడినరులను ప్రేమించేవాడు. అది అతని నిర్వచనం.

ఇక ప్రేమను గూర్చి పైన పౌలు చెప్పిన లక్షణాలన్నీ క్రీస్తులో గోచరిస్తాయి. ఆయన ప్రేమావతారం. మనం ఈ ప్రేమగుణాలను ఎంతగా అలవర్చుకొంటామో అంతగా ఆ ప్రభువుని పోలివుంటాం. సోదరప్రేమను సాధించడం కంటె ఈ మంటిమిూద మనం చేయగలిగిన మహత్తరకార్యం మరొకటి లేదు.

పై ప్రేమ లక్షణాలన్నీ క్రీస్తుకి వర్తిసాయని చెప్పాం. ఉదాహరణకు క్రీస్తు తన స్వార్గాన్ని తాను చూచుకోలేదు, కోపపడలేదు, ఇతరులు తనకు చేసిన అపకారాలను మనసులో పెట్టుకోలేదు. కాని ఈ లక్షణాలు ఇదే విధంగా మనకు కూడ వర్తిస్తాయని చెప్పగలమా? పై వాక్యంలో క్రీస్తు పేరును తొలగించి దాని స్థానంలో మన పేరును చేర్చితే వాక్యం భావం కుదురుతుందా?

ఈ యొక్క ఉదాహరణనుబట్టే సోదరప్రేమ ఎంత కష్టమైనదో అర్థం చేసికోవచ్చు అసలు క్రైస్తవమతంలో సోదరప్రేమ అంతకష్టమైన కార్యం మరొకటి లేదు. దీన్ని పాటించేవాళ్ళకు గాని దీనిలోని లోతుపాతులు తెలియవు. మనంతట మనం ఈ ప్రేమను సాధించలేం. అందుకే దేవుడు కరుణతో పరిశుద్దాత్మ ద్వారా ఈ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తూంటాడు. కనుక మన తరపున మనం ఈ భాగ్యం కొరకు ఆయాత్మనే అడుగుకోవాలి.